Latest News

వ్యర్థాలపై సమర్థ వ్యూహం!
‘కాదేదీ పునశ్శుద్ధికి అనర్హం’ అనుకుంటూ ఎన్నో దేశాలు వ్యర్థాలనూ సమర్థ వనరులుగా మలచుకుంటుంటే, ఆ విషయంలో ఇండియా వెనకబాటు అనేక అనర్థాలకు దారితీస్తోంది. అధునాతన జీవనశైలి కారణంగా ఏటికేడు పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వ్యర్థాల (ఈ-వ్యర్థాల) పునశ్శుద్ధిని పెద్ద పరిశ్రమగా వృద్ధిచేసిన దక్షిణ కొరియా, యూకే, జపాన్‌, నెదర్లాండ్స్‌ లాంటివి అగ్రరాజ్యమైన అమెరికానే తలదన్ని దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఈ-వ్యర్థాల పునశ్శుద్ధి 40శాతానికి చేరగా, ఆ నాలుగూ 50నుంచి 80శాతం దాకా సాధిస్తూ అబ్బురపరుస్తున్నాయి. నవీన జీవనశైలికి సంకేతాలైన పలు వస్తూత్పాదనలు కొన్నాళ్ల వినియోగానంతరం ఈ-వ్యర్థాలుగా మారి దేశ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి గడ్డుసవాళ్లు విసరుతున్నాయి. పాతబడిన కంప్యూటర్లు, టీవీలు, చరవాణులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు లాంటివి దేశంలో కుప్పలుతెప్పలుగా పోగుపడుతున్నాయి. ఇండియాలో ఏటా అలా ‘ఉత్పత్తవుతున్న’ వ్యర్థాల రాశి ఎకాయెకి 18.5లక్షల టన్నులు. దిగ్భ్రమపరచే ఈ గణాంకాలు, భారత్‌ పోనుపోను ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతోందో చాటుతున్నాయి. ఏడాదికి 1.2లక్షల మెట్రిక్‌ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో ముంబయి నగరం ‘ముందంజ వేస్తోంది’. దిల్లీ(98వేల టన్నులు), బెంగళూరు (92వేలు), చెన్నై (67వేలు) కోల్‌కతా (55వేలు), అహ్మదాబాద్‌ (36వేలు), హైదరాబాద్‌ (32వేలు) నగరాల్లోనూ భారీగా ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అసోచామ్‌, కేపీఎమ్‌జీ సంస్థల సంయుక్త అధ్యయనం తాజాగా వెల్లడించింది. దేశంలో అలా ఉత్పత్తవుతున్న ఈ-వ్యర్థాల్లో కేవలం 2.5శాతమే రీసైక్లింగుకు నోచుకుంటున్నాయన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. లక్షల టన్నుల మేర పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు నేలను, నీటిని, గాలిని విషకలుషితం చేసేస్తున్నాయి. వాటివల్ల మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని, పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యమూ ఏర్పడుతుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో- దిద్దుబాటు వ్యూహాలు చురుగ్గా పదును తేలాల్సి ఉంది!
అత్యధికంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తరవాతి స్థానం ఇండియాదేనని ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఏడాది క్రితం ధ్రువీకరించింది. మూడేళ్ల వ్యవధిలో విశ్వవ్యాప్తంగా ఈ-వ్యర్థాల పరిమాణం 21శాతం దాకా విస్తరించనుందనీ ఆ నివేదిక హెచ్చరించింది. ఏదైనా కొత్త వస్తూత్పాదన విపణిలో పాదం మోపిందే తడవుగా దాన్ని సొంతం చేసుకోవాలన్న మోజు, వేలంవెర్రి పోటీ ఇంతలంతలైన వాతావరణం దృష్ట్యా- దేశీయంగా మరింత ప్రమాదం నెత్తిన ఉరుముతోంది. ఇప్పటికే వందకోట్లకు పైబడి చరవాణులు ఉపయోగిస్తున్న భారత్‌లో, ఏటా దాదాపు నాలుగోవంతు ఈ-వ్యర్థాల బాట పడుతున్నాయి. ఇంకో మూడేళ్లలోనే భారతగడ్డ మీద సంవత్సరానికి 30లక్షల టన్నుల దాకా వ్యర్థాల ఉత్పత్తి నమోదు కానుందని ‘అసోచామ్‌’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) భవిష్యద్దర్శనం చేస్తోంది. ప్రస్తుతం ఎడాపెడా వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాల్లో సింహభాగం ప్రధానంగా అసంఘటిత రంగానికే చేరుతోంది. వాటిని పునశ్శుద్ధి చేసే నైపుణ్యం, అందుకు అవసరమైన శిక్షణ కొరవడి బడుగు కార్మికులు, పేద పిల్లలు హానికర రసాయనాలూ అవశేషాల కారణంగా మహమ్మారి వ్యాధుల పాలబడుతున్నారు. అటు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ, ఇటు అసంఖ్యాక అభాగ్యుల బతుకుల్ని కర్కశంగా కాటేస్తున్న ఈ-వ్యర్థాల నియంత్రణపై ప్రజల భాగస్వామ్యానికి ప్రోదిచేసే పటుతర కార్యాచరణ తక్షణావసరం. ఈ కీలకాంశానికి సమధిక ప్రాముఖ్యం చేకూరితేనే, ‘స్వచ్ఛభారత్‌’ స్ఫూర్తి సంపూర్ణ ఫలితాలను ఒడిసిపట్టగలదన్నది యథార్థం.
హానికరమైన వ్యర్థ పదార్థాల దిగుమతిని నిషేధిస్తూ బాసెల్‌ ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ ఒకటి. స్వదేశంలో పద్ధతి ప్రకారం పునశ్శుద్ధి కార్యక్రమాలు చేపట్టేకన్నా గప్‌చుప్‌గా ఆసియాకో ఆఫ్రికాకో తరలించేస్తే ఎంతో మిగులు అన్న సంపన్న రాజ్యాల దుస్తంత్రం పుణ్యమా అని, ఆ ఒప్పందం నిలువునా నీరుగారుతోంది. ఆఫ్రికాలో ఘనా, నైజీరియాలకు; ఆసియాలో చైనా, మలేసియా, పాకిస్థాన్లతోపాటు భారత్‌కు ఈ-వ్యర్థాల అక్రమ రవాణా ఏటికేడు పోటెత్తుతోంది. ఈ-వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసమంటూ 2011లో క్రోడీకరించిన నిబంధనల అమలు బాధ్యతను యూపీఏ జమానా గాలికొదిలేసింది. పది వారాల క్రితం నూతన నిబంధనావళిని గెజెట్‌లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం- వస్తూత్పాదకులు, డీలర్లు, రాష్ట్రప్రభుత్వాల ఇదమిత్థ బాధ్యతల్ని రెండో ప్రకరణంలో పేర్కొంది. వాటిపై విస్తృత జనచేతన పెంపొందించడంతోపాటు ఈ-వ్యర్థాల సేకరణ, నిర్వహణలకు రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్లను ఆయత్తపరచడం ప్రజాప్రభుత్వాల విహిత బాధ్యత! నిర్ణీత గడువు ముగియడంతోనే విక్రయదారులే ఈ-వ్యర్థాలను వెనక్కి తీసుకునే పద్ధతి నార్వేలో దశాబ్దం కాలంగా అమలవుతోంది. పాత టీవీలు తదితరాల్ని పౌరులు, స్వచ్ఛంద సంస్థలు పునర్వినియోగ కేంద్రాలకు తరలించే సంస్కృతి స్వీడన్‌లో వేళ్లూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశంగా అవతరించిన స్వీడన్‌ అనుభవాలు, దేశీయ వ్యూహాలకు ఒరవడి దిద్దాలి. వెలుపలి నుంచి అక్రమ తరలింపులు వెల్లువెత్తకుండా కాచుకుంటూ, క్రమేణా పునశ్శుద్ధి కేంద్రాలను విస్తరించే ద్విముఖ ప్రణాళికను సజావుగా పట్టాలకు ఎక్కించడమే- వ్యర్థాల సమస్యకు సరైన విరుగుడు అవుతుంది!


పొరుగు దేశాలతో రాదారి బంధం 
ఈశాన్య భారతానికి వరం 
భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ద్వారా ఆగ్నేయాసియాతో పాటు మనదేశంలోని వెనకబడిన ఈశాన్య ప్రాంత ముఖచిత్రం మారిపోనుంది. ఈ రహదారి ఫలితంగా మౌలిక వసతులు పెరిగి చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కలగనుంది. మూడు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ రహదారి మణిపూర్‌లోని మోరె నుంచి మియన్మార్‌లోని టము, మాండలే నగరం మీదుగా థాయ్‌లాండ్‌లోని మాయోసోట్‌ జిల్లా టాక్‌ వరకు విస్తరించేలా ప్రణాళిక రచించారు. దీనిపై వాహనాల ప్రయాణానికి అవసరమైన త్రైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందం కోసం మూడు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ నుంచి ఈ మార్గం మీదుగా ఫార్మా, యంత్రాలు, యంత్రపరికరాలు, ప్లాస్టిక్‌, వాహనాలు, పత్తి ఎగుమతి చేస్తారు. రహదారి మొత్తం పొడవు 1,400 కిలోమీటర్లు. మొదటి దశలో 78 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. మియన్మార్‌లోని 73వంతెనలను భారత్‌ నిధులతో ఆధునీకరిస్తున్నారు. మరో 400 కిలోమీటర్ల రహదారిని ఆధునీకరిస్తారు. భారత్‌కు చెందిన సరిహద్దు రహదారి సంస్థ మియన్మార్‌లోని టము-కలెవ్వా-కలెమై రహదారిని ఇప్పటికే అభివృద్ధి చేసింది. మొదటిదశలో 192, రెండోదశలో వంద కిలోమీటర్ల రహదారిని థాయ్‌లాండ్‌ అభివృద్ధి చేయనుంది. ఏడాదిన్నర వ్యవధిలో రహదారి పనులు పూర్తి కాగలవని భావిస్తున్నారు. మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాలో గల మోరె పట్టణం మియన్మార్‌ సరిహద్దుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా మోరెకు పేరుంది.
వాణిజ్యానికి కొత్త వూపు 

తొంభయ్యో దశకంలో పీవీ నరసింహారావు హయాములో ప్రారంభమైన ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని తరవాత వచ్చిన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో ద్వైపాక్షిక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని ‘యాక్ట్‌ ఈస్ట్‌’గా మార్చి అభివృద్ధికి దారులు పరుస్తోంది. అధికారం చేపట్టగానే 2014 నవంబరులో మోదీ మియన్మార్‌ సందర్శించారు. భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి వెనక భారత్‌ చొరవ ఉంది. భారత ఈశాన్య ప్రాంతం ఆగ్నేయాసియాకు ముఖద్వారం వంటిది. బంగ్లాదేశ్‌, చైనా, భూటాన్‌, మియన్మార్‌ సరిహద్దులు గల ఈశాన్య ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకింత భిన్నంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు విస్తృత సహజ వనరులకు నిలయాలు. అపారమైన జల వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే జలవిద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ ఉపయోగపడుతుంది. అవసరాలకు పోగా మిగిలినది పొరుగు దేశాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. దేశం మొత్తం వెదురులో 28శాతం ఈ ప్రాంతం నుంచే లభిస్తుంది. ఇందులో మిజోరాం ముందుంది. వెదురు ఉత్పత్తిలో భారత్‌ ఆసియాలో రెండోస్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏటా 46వేల టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా రబ్బరు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. రబ్బరు సాగును ప్రోత్సహించడం ద్వారా 2017నాటికి సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని భారత రబ్బరు సంస్థ ప్రతిపాదించింది. తేయాకు సాగుకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి. అసోమ్‌లో తేయాకు అత్యధికంగా సాగు చేస్తారు. దేశంలో 50శాతానికి పైగా ఉత్పత్తి ఇక్కడి నుంచే లభిస్తోంది. మానవ వనరులకు కొరత లేదు. ఈ నేపథ్యంలో తేయాకు, రబ్బరు, వెదురు ఆధారిత చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.

మియన్మార్‌ చూడటానికి చిన్న దేశమే కావచ్చు. కానీ, అపారమైన సహజ వనరులకు అది నిలయం. విస్తృత తీరప్రాంతంతో పాటు సారవంతమైన నేలలకు కొదవ లేదు. ఈ ఆగ్నేయాసియా దేశంతో మొదటినుంచీ మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అంగ్‌సాన్‌ సూచీ ప్రజాస్వామ్య ఉద్యమానికి అండగా నిలిచింది. అదే సమయంలో సైనిక పాలకులతో కూడా సత్సంబంధాలు నెరపింది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటోంది. బంగాళాఖాతం తీరప్రాంతం కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మియన్మార్‌ వాసులతో సత్సంబంధాలు ఉన్నాయి. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల మధ్య మియన్మార్‌ వారధి లాంటింది. మణిపూర్‌లోని మోరె, ఇంఫాల్‌ నుంచి మియన్మార్‌లోని రెండో అతి పెద్ద నగరమైన మాండలేల మధ్య బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన నేటికీ కార్యరూపం దాల్చలేదు. గతంలో మణిపూర్‌, నాగాలాండ్‌లకు చెందిన కొన్ని తిరుగుబాటు బృందాలు మియన్మార్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాయి. ఆ దేశంతో సత్సంబంధాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదానికి కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. థాయ్‌లాండ్‌ తరవాత మన దేశమే మియన్మార్‌కు అతిపెద్ద మార్కెట్‌. ఆ దేశ ఎగుమతుల్లో పాతిక శాతం భారత్‌కే వస్తున్నాయి. వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, చమురు, సహజవాయువు, ఆహారశుద్ధి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. పెద్దసంఖ్యలో మియన్మార్‌ వాసులు అనధికారికంగా ఈశాన్య రాష్ట్రాల్లో నివసిస్తూ ఉపాధి పొందుతున్నారు. నిన్న మొన్నటి దాకా సైనిక పాలనతో విసిగిపోయినవారికి స్వదేశంకన్నా భారత్‌లోనే తమకు మంచి భవిష్యత్తు ఉందని వారు భావిస్తున్నారు. మియన్మార్‌కు భారత్‌ నాలుగో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. థాయ్‌లాండ్‌, సింగపూర్‌, చైనా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బహుళ ప్రయోజనాలు 

దశాబ్దాల సైనిక పాలన నుంచి ఇటీవలే ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన మియన్మార్‌లో వాణిజ్యావకాశాలు, పునర్నిర్మాణ పనులపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. మొదటి నుంచీ మియన్మార్‌పై కన్నేసిన చైనా ఈ విషయంలో భారత్‌కన్నా ముందే ఉంది. భారత్‌ కాస్త ఆలస్యంగా మేలుకుంది. మే మూడోవారంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మియన్మార్‌లో పర్యటించారు. భారత్‌కు చెందిన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తోంది. దశాబ్దాల పాటు మియన్మార్‌ సైనిక పాలనలో ఉన్నందువల్ల ఆ దేశంతో మన వాణిజ్యం తక్కువే. దానికితోడు సైనిక పాలకులపై చైనా ప్రభావం కారణంగా చెప్పుకోదగ్గ వాణిజ్యం జరగలేదు. 2020నాటికి వెయ్యి కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడటం, పునర్నిర్మాణ పనులపై అక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టడం వల్ల మున్ముందు వాణిజ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. తాజా రహదారి వల్ల నేరుగా రాకపోకలు సాగించేందుకు; ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. థాయ్‌లాండ్‌తోనూ మనకు సత్సంబంధాలే ఉన్నాయి. 2014లో ఇరుదేశాల మధ్య 800కోట్ల డాలర్ల మేర వాణిజ్యం జరిగింది. 2015లో ఇది 1,200కోట్ల డాలర్లకు పెరిగింది. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన థాయ్‌లాండ్‌ను నిరుడు పది లక్షల మందికి పైగా భారతీయ పర్యాటకులు సందర్శించారని అంచనా. తాజా రహదారి వల్ల వాణిజ్యంతోపాటు పర్యాటకుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యావకాశాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి దోహదపడే భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ఎంత త్వరగా కార్యరూపం దాలిస్తే అంత మంచిది!

- గోపరాజు మల్లపరాజు

అంతర్జాలమే తరగతి గది! 
ఉన్నత విద్యలో తొలగుతున్న దూరాభారాలు 
న్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ఓ కీలక సమావేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఉపాధ్యక్షులు చేసిన ప్రకటన ఆ మేరకు నిర్దిష్ట సంకేతాలు అందించింది. దేశంలోని 850కిపైగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కొత్త మార్పులు అందిపుచ్చుకొనేందుకు సమాయత్తం కావాలన్న ‘యూజీసీ’ పిలుపు ఒకరకంగా ‘వర్సిటీల’ మొద్దునిద్ర వదిలించేదే! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అభ్యసించడానికి వీలుగా ‘ఆన్‌లైన్‌ కోర్సు’లు రూపొందించాలన్న అంశంపై ఆ సమావేశం ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘మూక్స్‌’ తరహాలో యువత కోసం ‘స్వయం’ పోర్టల్‌ను మానవ వనరులశాఖ ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కోర్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దారిచూపిన పశ్చిమ దేశాలు
అంతర్జాల విద్యకు సంబంధించి విదేశాలు భారత్‌తో పోలిస్తే ఎంతో ముందున్నాయి. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన ‘కోర్స్‌ఎరా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా అనేక రకాల కోర్సులు చదువుకోగల అద్భుత అవకాశం ఆవిష్కృతమైంది. సుమారు 20కిపైగా ఉన్న ఇలాంటి అంతర్జాలయ విద్యాసంస్థల్లో అధికంగా నమోదు చేసుకుంటున్నవారిలో అమెరికన్లది తొలిస్థానం. రెండో స్థానంలో భారతీయులు ఉండటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక, మానవీయ శాస్త్రాల్లోనూ ఈ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఒకేచోట తరగతి గదులు, బోధన కార్యకలాపాల నిర్వహణ అనే పద్ధతిని ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌ వంటి సంస్థలు సమూలంగా మార్చివేశాయి. ఈ విద్యాసంస్థలు అందించే కోర్సులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అందిపుచ్చుకొంటున్నారు.

సరికొత్త పోకడ 

భారత ప్రభుత్వం నూతన విద్యావిధానం ఆవిష్కరించడానికి ముందే రెండు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒకటి ఐచ్ఛికంగా ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతి. రెండోది- అంతర్జాలం ద్వారా విద్యార్జన మార్గాలకు ద్వారాలు తెరచుకోవడం. విద్యార్థులు తాము ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతిలో ప్రధాన పాఠ్య విభాగాలతోపాటు, వారికి ఆసక్తి ఉన్న లేదా అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఉపకరించే అంశాలను మొత్తం కోర్సులో 20శాతం మేర ఎంపిక చేసుకునే అవకాశం అతి త్వరలో రాబోతోంది. ఇక ఉన్నత విద్యలో అంతర్జాల కోర్సులకు ఆదరణ క్రమేపీ పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం ఆరున్నర లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఎడక్స్‌, కోర్స్‌ఎరా వంటి అంతర్జాల కోర్సులు అందించే సంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యను అభ్యసించడంలో యువతలో మారుతున్న అభిరుచికి ఇది సంకేతం. పేర్లు నమోదు చేసుకున్నవారిలో నేరుగా తరగతి గదులకు హాజరవుతున్న విద్యార్థులూ లక్షల సంఖ్యలో ఉండటం కొత్త కోణం. ఒకరకంగా ఇది మంచి పరిణామం. నేటి యువతకు సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో ప్రావీణ్యం తప్పనిసరి అవసరం అయింది. వారి అభ్యసన, ఉద్యోగ, దైనందిన అవసరాల్లో ఈ అప్లికేషన్ల వినియోగం అనివార్యంగా మారుతోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా విధానకర్తలను, విద్యావేత్తలను ప్రేరేపిస్తున్న పరిణామమిది. రాన్రాను అంతర్జాల బోధన, అభ్యసనలకు ఉన్నత విద్యావ్యవస్థలో చోటు పెరుగుతోంది. అభ్యసిస్తున్న డిగ్రీల్లో ఇరవై శాతానికి సమానమైన అంతర్జాల కోర్సులను గుర్తింపు పొందిన ఇతర విశ్వవిద్యాసంస్థల నుంచి పొందవచ్చునని యూజీసీ విధాన నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ప్రకటన వెలువడటమే తరువాయి. విద్యావ్యవస్థను సాంకేతిక పథం తొక్కిస్తున్న ఈ పరిణామాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. హైస్కూలు నుంచి విశ్వవిద్యాలయాల వరకు అనేక కోర్సులను ముఖాముఖి పద్ధతిలో విన్న అనుభూతి కలిగించే విధంగా అంతర్జాలం ద్వారా రకరకాల కోర్సులు అందించేందుకు యూజీసీ కృతనిశ్చయంతో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌పీటీఈఎల్‌ (సాంకేతిక విజ్ఞానంతో అభ్యసనను కొనసాగించే జాతీయ కార్యక్రమం) 23 పాఠ్యాంశాల్లో సుమారు తొంభైకిపైగా కోర్సులు అందిస్తోంది. యూజీసీ ప్రయోగానికి వూపునిచ్చే పరిణామమిది.
సాంకేతిక విజ్ఞాన సాయంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గట్టి సవాలే. అయితే, విద్యారంగం ఏనాటి నుంచో ఎదుర్కొంటున్న మరో నాలుగు సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చించుకోవాల్సి ఉంది. అవి: అందరికీ అందుబాటులో విద్య, చదువుల్లో నాణ్యత, సమకాలీన అవసరాలకు తగిన విద్య, సమృద్ధిగా నిధులు. ఈ నాలుగూ దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు. ఇటీవలి అధ్యయనాల్లో దేశంలో కేవలం 23శాతం విద్యార్థులు మాత్రమే వయసుకు తగిన విద్య అభ్యసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మరోవంక నాణ్యమైన విద్యకు సంబంధించి జవాబులు వెదకాల్సిన ఎన్నో ప్రశ్నలు మనముందున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగిన విద్య అందించడంలోనూ వెనకబాటు కనిపిస్తోంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సుమారు ఎనభైశాతం నిరుద్యోగులుగానే మిగిలిపోతుండటం శోచనీయం. ప్రమాణాలు పెంచేందుకు తగినన్ని ఆర్థిక వనరులు లభించకపోవడం బాధ కలిగించే విషయం. ఆర్థిక వనరుల సమస్య ఈనాటిది కాదు. అది 1968నుంచీ ఉన్న పరిస్థితే. నిధుల కేటాయింపులో 1998నుంచి కొంత పెరుగుదల ఉన్నప్పటికీ కాలంతోపాటు పెరుగుతున్న సవాళ్ల స్థాయికి తగినట్లుగా మాత్రం అవి లేవు.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నాసిరకం విద్య అందించడంలో పోటీపడుతున్నాయి. అడుగంటుతున్న విద్యా ప్రమాణాలు ప్రభుత్వాన్నే నిర్ఘాంతపరుస్తున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఆచరణలో ఎంతగా విఫలమవుతుందో కళ్లకు కనిపిస్తూనే ఉంది. వ్యవస్థలోని లోపాలను ఎక్కడికక్కడ అలాగే ఉంచి, కళాశాలల్లో తనిఖీలకు ప్రభుత్వ యంత్రాంగం పరిమితమవుతుండటం పతనమవుతున్న ప్రమాణాలకే నిదర్శనం. విద్యార్థులు విషయాలను అవగతం చేసుకుని, నేర్చుకొనే పద్ధతుల్లోనూ ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు భారతీయ సమాజంలో వెన్వెంటనే అంతర్భాగంగా మారిపోతున్నాయి. సమస్యను సరైన కోణంలో అర్థంచేసుకొని పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత- విద్యావేత్తలది, విధానకర్తలది! బోధన, అభ్యసనల్లో నాణ్యత అన్నవి పరస్పరం ప్రభావితమయ్యే అంశాలు. బోధన రంగంలో ఆశించిన మార్పులు తీసుకురావడం అనుకున్నంత తేలిక కాదు. బోధనలో నాణ్యత పెంచడానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఓపెన్‌, దూరవిద్య విధానాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. సమాచార సాంకేతిక ఆధారిత బోధన పద్ధతులూ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞాన ఆగమనంతో విద్యార్జనలో నూతన శకం మొదలైంది. భారత ప్రభుత్వం ఇటీవల ‘ఈ-పాఠశాల’కు అంకురారోపణ చేయడం ద్వారా బహుముఖ కోణాల్లో జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో తరగతుల నిర్వహణకు తగిన సాధన సంపత్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
కాలానుగుణ మార్పులు 

పదేళ్ల క్రితమే భారత్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు ఈ తరహా కోర్సులను అంతర్జాలం ద్వారా అందించడం ప్రారంభించాయి. విద్యాబోధనలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మార్పులను, ఆయా రంగాల్లో వస్తున్న నూతన ధోరణులను గమనించి కాలానుగుణంగా కోర్సులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. సాంకేతిక విజ్ఞాన సాయంతో పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటున్నాయి. కాలంతోపాటు వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఈ కోర్సుల్లో భాగం చేయాలి. ఆ రకంగా నేటితరానికి అంతర్జాల విద్యాకోర్సులు తిరుగులేని వరాలుగా మారబోతున్నాయి. ఆయా రంగాల్లో ఆధునిక మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు కోర్సులను నవీకరించడం ఎంతో అవసరం. అంతర్జాల విద్యావిధానం ప్రపంచాన్ని పలకరించి ఇప్పటికే దశాబ్దం దాటిపోయింది. అన్ని వయసులవారూ ఈ పద్ధతి ద్వారా విద్య అభ్యసించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల బోధకులకూ ఎంతో వెసులుబాటు లభిస్తోంది. తాజా మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, తమను తాము నవీకరించుకునేందుకు ఈ ఆధునిక విద్యావిధానం వారికి అవకాశం ఇస్తోంది. విద్యార్థుల అభ్యసనం తీరుతెన్నులను నిర్దిష్టంగా మదింపు చేసి, వారిని మరింత సానపట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, పట్టికలు వంటి వనరులన్నీ ఒకేచోట లభించడంవల్ల, ఆయా అంశాలను నేర్చుకోవడం- ఆసక్తికరం, విజ్ఞానదాయకం! యూజీసీ సూచించబోయే నూతన విధానంలో విద్యార్థులు 60శాతం నుంచి 70శాతం వరకు పాఠ్యాంశాలకు సంబంధించిన మౌలిక విషయాలను సంప్రదాయ పద్ధతిలోనే నేర్చుకుంటారు. మిగిలిన 30శాతం పాఠ్యాంశాలను మారుతున్న అవసరాలకు తగిన నైపుణ్యాలను అలవరచుకునేందుకు ఉపకరించే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా నైపుణ్యాలను వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి విఖ్యాత సంస్థలు అందించే అంతర్జాల కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే నేర్చుకోవచ్చు. ఆ మేరకు సునాయాసంగా డిగ్రీలూ పూర్తిచేయవచ్చు. ఈ తరహా సమ్మిళిత కోర్సుల అభ్యసనంవల్ల పట్టాల విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ తరహా మార్పులను సమర్థంగా అమలు చేయాలంటే ఉన్నత విద్యాసంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరం. జ్ఞానాన్ని మించిన సంపద లేదు. అజ్ఞానంకంటే పేదరికంలేదు. గతిశీల ప్రపంచం నిరంతరం మనకందిస్తున్న విలువైన సూత్రమిది. దీన్ని ఆచరణలోకి మార్చుకోవడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం.
- ఆచార్య ఇవటూరి రామబ్రహ్మం


న్యాయానికి ఒక్కడు! 
ఆత్యయిక స్థితిపై తీర్పునకు 40ఏళ్లు 
ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భారత న్యాయ వ్యవస్థ సమున్నత సంప్రదాయాలు నెలకొల్పుతోంది. సామాజిక సంక్లిష్టతలను అర్థం చేసుకొని, పౌరుల స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ తీర్పులు ఇవ్వడంలో కాలం గడుస్తున్నకొద్దీ భారత న్యాయవ్యవస్థలు పరిణతి చెందుతున్నాయి. అత్యవసర పరిస్థితి కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పు మాత్రం అందరినీ నివ్వెరపాటుకు గురిచేసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం, ఏప్రిల్‌ 28న ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు చరిత్రలో ఓ మాయనిమచ్చలా మిగిలిపోయింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలుజేసిన ‘ఏడీఎం జబల్పూర్‌’ కేసులో నాలుగు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు సరిగ్గా ఇవ్వాళ్టి రోజే తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యవాదుల, స్వేచ్ఛాకాముకుల విశ్వాసాలపై బలంగా దెబ్బకొడుతూ భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిణామక్రమంలో ప్రజల పక్షాన అద్భుతమైన తీర్పులు వెలువరిస్తున్న న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తీసుకువచ్చిన ఆ తీర్పును మననం చేసుకోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- రాజకీయ కారణాలతో ప్రభావితం కాకుండా తీర్పులు వెలువరించాల్సిన అవసరాన్ని పునస్మరించుకోవడం. రెండోది- నలుగురు న్యాయమూర్తులు ఒకవైపు నిలిచినా, తాను ఒక్కడే సత్యంవైపు నిలిచి ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా నిర్భయంగా ‘మైనారిటీ తీర్పు’ ప్రకటించిన జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా ప్రతిభను, ధైర్యాన్ని, ఆయనకు న్యాయనిపుణులు ఇచ్చిన గౌరవాన్ని తెలియచెప్పడం!
ఆత్యయిక పరిస్థితి చీకటి రోజుల్లో అడ్డూఆపూ లేకుండా అక్రమ నిర్బంధాలు జరిగాయి. విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను, వారి అనుచరులను ఎటువంటి విచారణ లేకుండా నెలల తరబడి జైలులో ఉంచే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. చట్టసభలు నిర్వీర్యమై, ప్రభుత్వ పోలీసు యంత్రాంగాలు యథేచ్ఛగా జులుం ప్రదర్శిస్తున్నప్పుడు, కొందరు ఆశావాదులు రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదు అని అప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసి ఉన్నారు. కాబట్టి తమ అరెస్టులను ప్రశ్నిస్తూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు లేదన్నది ఏలినవారి వాదన. ఆ వాదనతో రాష్ట్రాల్లోని ఏ హైకోర్టూ ఏకీభవించలేదు. అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ జారీ చేయవచ్చు అని స్పష్టం చేస్తూ రాష్ట్రాల్లోని సర్వోన్నత న్యాయస్థానాలు తీర్పులు వెలువరించాయి.
హైకోర్టుల తీర్పును జీర్ణించుకోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అన్ని అప్పీళ్లనూ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. వాదనలు వింటున్న సమయంలో జస్టిస్‌ ఖన్నా ‘ఎమర్జెన్సీ కాలంలో పౌరులను పోలీసులు చంపివేసినా కోర్టులు ఏమీ చేయలేవా?’ అని అడ్వకేట్‌ జనరల్‌ని ప్రశ్నిస్తే, ఆయన ‘ఏమీ చేయలేవు’ అని సమాధానమిచ్చారు. అలాంటి జవాబు ప్రభుత్వంవైపునుంచి విన్న తరవాత కూడా సర్కారీ వాదనను సమర్థిస్తూ 4:1 మెజారిటీతో ధర్మాసనం అప్పట్లో తీర్పు ప్రకటించడం గమనార్హం. ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్షలను మంట కలుపుతూ, సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు జడ్జీలు ప్రకటించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం పౌరులను చంపివేసినా, అత్యున్నత న్యాయస్థానంతోసహా, ఏ కోర్టూ ఏమీ చేయలేదని చెప్పడంతో న్యాయ ప్రపంచం నివ్వెరపోయింది.
మెజార్టీ తీర్పు పాలకుల పక్షాన వస్తే- జస్టిస్‌ ఖన్నా గళం ఒక్కటి మాత్రం ప్రజల వైపున నిలిచింది. జీవించే హక్కు ప్రభుత్వాలు ప్రసాదించినది కాదు కాబట్టి, ఆ హక్కును హరించే హక్కు సర్కారుకు లేదంటూ ఆయన ఇచ్చిన తీర్పునకు విశేష ప్రాచుర్యం లభించింది. ‘మైనార్టీ తీర్పు’గా అది అమలుకు నోచుకోనప్పటికీ- న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, నిష్పాక్షికతకు ఆయన తీర్పు దర్పణంగా నిలిచింది. కానీ, ఆ తీర్పు జస్టిస్‌ ఖన్నాకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన తరుణంలో, ఆయనకంటే జూనియర్‌గా ఉన్న మరో వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీచేశారు. అందుకు నిరసనగా జస్టిస్‌ ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. పదవినుంచి వైదొలగినా ప్రపంచవ్యాప్తంగా నిష్పక్షపాత న్యాయానికి నిలువెత్తు రూపంగా జస్టిస్‌ ఖన్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
గడచిన రెండున్న దశాబ్దాలుగా భారత న్యాయవ్యవస్థ ప్రజల తరఫున నిలిచి అనేక సంచలన తీర్పులు ప్రకటిస్తోంది. జస్టిస్‌ ఖన్నా వంటి మహనీయుల స్ఫూర్తితో స్వతంత్ర న్యాయవ్యవస్థ విశిష్టతను కాపాడుకునే క్రమంలో మరింత అంకితభావం ప్రదర్శించాల్సిన అవసరం కొట్టిపారేయలేనిది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు విరివిగా బెయిళ్లు మంజూరు చేస్తున్నారనే కారణంతో పోలీసు యంత్రాంగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఒక ప్రధాన జ్యుడిషియల్‌ మేజిస్ట్రేటుని ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త కలవరం కలిగిస్తోంది. జాతీయ జ్యుడిషియల్‌ అకాడెమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ప్రసంగించడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన విషయం కేవలం విచారించవలసిన విషయం కాదు- నిశితంగా చర్చించాల్సిన అంశం! దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాలన్నింటిలోనూ జడ్జీలను నియమించకుండా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతున్నాయా అనే సందేహమూ కలుగుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై పాలకులకు ఉన్న లేదా లేని అవగాహనపై చర్చ మొదలు పెట్టాల్సిన సమయమూ ఆసన్నమైంది. ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించే; ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థను ఏ స్థాయిలో అప్రతిష్ఠ పాలు చేస్తాయన్న విషయాన్నీ మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
- కె.పట్టాభిరామారావు 
(రచయిత- జాతీయ పోలీసు అకాడమీ ఉపసంచాలకులు)
Courtesy : ఈనాడు 

నేల... పట్టు తప్పుతున్న వేళ! 
వరస భూకంపాలు- నేర్వాల్సిన పాఠాలు 

క్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వరసగా సంభవిస్తున్న పెను భూకంపాలు ప్రపంచం మొత్తానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను సైతం భూమ్మీదనుంచే నియంత్రించగల అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంలో పరిణతి సాధించిన మానవ మేధకు, భూమి లోపలి పొరల్లో నిత్యం చోటుచేసుకుంటున్న కదలికల గురించి అంతుచిక్కకపోవడం ఆశ్చర్యకరమే. స్వల్ప వ్యవధిలో అపార నష్టాలను తెచ్చే భూకంపాలను ముందుగానే పసిగట్టే దిశగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోని సంక్లిష్టతల దృష్ట్యా నిర్దిష్ట ఫలితాలు మాత్రం దక్కడం లేదు. కొన్ని సెకన్ల ముందు భూకంపాల రాకను పసిగట్టగల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో వరస ప్రకంపనలు; జపాన్‌, ఈక్వెడార్లలో పెను భూకంపాలు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి పదహారు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22 భూప్రకంపనలు నమోదయ్యాయి. భారత్‌లో మూడుసార్లు, భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో రెండుసార్లు నమోదైన ప్రకంపనలు మనదేశానికీ వణుకు పుట్టిస్తున్నాయి.


సంక్లిష్ట సమస్య 
ఒకచోట భూకంపం వస్తే దాని ప్రకంపనల ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుంది. కానీ, జపాన్‌, ఈక్వెడార్లలో వచ్చిన భూకంపాలు కొత్త చర్చకు తెరతీశాయి. ఒకచోట భూకంపం వస్తే దాని ప్రభావం సుదూర ప్రాంతాలపైనా పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా భూవిజ్ఞాన సర్వేక్షణ సంస్థ చెబుతోంది. అందుకు దాఖలాగా జపాన్‌, ఈక్వెడార్‌ భూకంపాలను చూపుతోంది. రెండు దేశాల మధ్య 15,445 కిలోమీటర్ల దూరం ఉంది. తొలుత ఏప్రిల్‌ 15న జపాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. గంటల వ్యవధిలో ఈక్వెడార్‌ను 7.8 తీవ్రతతో పెను భూకంపం కుదిపేసింది. ఈ రెండు భూకంపాలూ ‘పసిఫిక్‌ అగ్నివలయం’లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూకంపాల్లో 98శాతం ఇక్కడే వస్తుంటాయి. విస్ఫోటక అగ్ని పర్వతాలు, భూకంప క్రియాశీలతకు ఈ ప్రాంతం నిలయం. ఈక్వెడార్‌లో భూకంపం ధాటికి పసిఫిక్‌ తీరంలోని పట్టణాలన్నీ దెబ్బతిన్నాయి. వందల మైళ్ల దూరంలోని రాజధాని క్విటో, వాణిజ్య నగరం గువాయాక్విల్‌ నగరాలనూ ప్రకంపనలు భీతిల్లజేశాయి. ప్రధాన భూకంపం తరవాతా 55సార్లు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూపొరల్లో సర్దుబాట్లు ఏ రీతిగా ఉన్నాయో దీన్నిబట్టి అవగతమవుతోంది. తాజా భూకంప ప్రాంతం నుంచి దక్షిణాన 43కి.మీ. దూరంలో సరిగ్గా 74ఏళ్ల క్రితం 1942 మే 14న రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. జపాన్‌లోనూ వరసగా రెండు రోజులు మొదట 6.1 తీవ్రతతో, మరుసటి రోజు 7.0 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. రెండు దేశాల్లో ఘటనల సామీప్యత, క్రమానుగత సంబంధం కారణాలవల్ల మరింత లోతైన అధ్యయనాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది.

అమెరికా భూవిజ్ఞాన సంస్థ అధ్యయనం ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 7.0 నుంచి 7.9 తీవ్రతతో కూడిన భూకంపాలు ఏటా 15సార్లు సంభవిస్తాయి. అత్యంత శక్తిమంతమైన 8.0 తీవ్రతగల భూకంపాలు ఏటా ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో చాలావరకు అత్యల్ప తీవ్రత కలిగినవి. వాటిని గుర్తించడం కుదరదు. శక్తిమంతమైన తీవ్రత భూకంపాలను గుర్తించేలోపే క్షణాల్లో అది పెను విధ్వంసం సృష్టిస్తుంది. భారత ఉపఖండంలోనూ భూప్రకంపనలు తరచూ నమోదవుతున్నాయి. పెను భూకంపం ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడుతోందన్న ఆందోళన భారత్‌ను కొంతకాలంగా కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో 59శాతం భూకంపం రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమే. నేపాల్‌ పెను భూకంపం విధ్వంసం అనంతరం పరిస్థితులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణులు విశ్లేషించారు. ఉత్తర భారతంలోని పర్వత సానువుల చుట్టూ ఉన్న ప్రాంతమంతటా భారీ భూకంపాల ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో హిమాలయాల ప్రాంతంలో అతి భారీ భూకంపం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న కేంద్ర విపత్తుల నిర్వహణ బృందం, రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 8.2గా ఉండొచ్చని అంచనా వేసింది. నిరుడు 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపమే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి నేపాల్‌ను మరుభూమిగా మార్చేసింది. ఈసారి మనదేశంలో 8.2 తీవ్రత భూకంపం వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వూహకు అందదు. భూ అంతర్భాగంలోని పలకల స్థానం భ్రంశం రేటు, దిశ, గమ్యం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేయలేకపోవడమే ప్రధాన లోపం. భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో కేంద్రసర్కారు 11 పర్వత ప్రాంతీయ రాష్ట్రాల సదస్సు నిర్వహించింది. నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, భారత్‌లోని హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలన్నింటికీ భారీ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పర్వత ప్రాంతాల్లో భవనాలు భూకంపాలను తట్టుకొనే విధంగా నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నేపాల్‌ భూకంపం తరవాత మొట్టమొదటిసారిగా భారత్‌లో భూకంప తరంగాలను ముందస్తుగా గుర్తించి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ఉత్తరాఖండ్‌లో నెలకొల్పారు. భూకంప పరిశోధనల్లో ఇది ఓ ముందడుగే. కాకపోతే భూకంపం రావడానికి కేవలం నలభై సెకనుల ముందు మాత్రమే హెచ్చరికల సమాచారాన్ని ఈ కేంద్రం అందజేయగలుగుతుంది. అదీ అయిదు, అంతకుమించిన పాయింట్ల తీవ్రతగల భూకంపాల సమాచారాన్ని పసిగడుతుంది. భూకంప సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు (పి) అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కాబట్టి సెన్సర్లు ముందుగా ‘పి’ తరంగాలను పసిగట్టి సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తాయి. వీటి వెనకే వచ్చే ద్వితీయ తరంగాలు (ఎస్‌) అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ నష్టాల్ని కలిగించి విధ్వంసాలు సృష్టిస్తాయి. ‘స్పేస్‌ డైనమిక్స్‌’ అనే ఇటలీ సంస్థ ఇప్పటికే ఇలాంటి ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థను జపాన్‌, ఇటలీ, అమెరికా దేశాల్లో ఏర్పాటు చేసింది. నిరుడు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచంలోని ఇతర దేశాలు వినియోగిస్తున్న వ్యవస్థలన్నింటికన్నా ముందస్తుగా భూకంపాల రాకను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ఈ కేంద్రం ప్రత్యేకత. భారత్‌ ఈ ఏడాది జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్‌’ సంస్థ సహకారంతో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది.

అధునాతన వ్యవస్థే దిక్కు 

ఆకస్మికంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో అత్యధిక స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమయ్యేవి భూకంపాలే. ప్రస్తుతం అనేక దేశాల్లో భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా భూవిజ్ఞాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచే ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోంది. భారత్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేయడం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. భారత్‌ ఈ దిశగా పరిశోధనలు జరిపి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాలిఫోర్నియాలో వినియోగిస్తున్న ఆధునిక ‘షేక్‌ అలర్ట్‌’ వ్యవస్థ తరహా భూకంప హెచ్చరిక-అప్రమత్త వ్యవస్థను భారత్‌లో సైతం వినియోగించుకునే దిశగా కృషి జరగాలి. జపాన్‌తోపాటు నేపాల్‌, ఈక్వెడార్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో, టర్కీ, ఇండొనేసియా, భారత్‌లు అత్యంత భూకంప సంభావ్యత గల దేశాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా భూకంప సంభావ్యత గల ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో హెచ్చరికల జారీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లయితే కనీసం కొన్ని సెకన్ల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా కనీసం ప్రాణనష్టాలనైనా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న భూకంపాలు, వరదలు తదితర విపత్తుల వల్ల 18,000కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుని అప్రమత్తంగా మసలుకోవడం ద్వారానే కొంతమేరకైనా విధ్వంస తీవ్రత తగ్గించవచ్చు. జపాన్‌ తరహాలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భవన నిర్మాణాల విషయంలో భూకంపాలను తట్టుకునే ఆకృతి, నిర్మాణ పద్ధతులను మనదేశమూ అభివృద్ధిపరచాలి. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య భూ ప్రకంపనలను తట్టుకునే విధంగా బేరింగులు ఏర్పాటు చేయాలి. భూకంప తీవ్రత తగ్గించేలా నిర్మాణాలు చేపట్టడానికి భారతీయ ప్రమాణాల సంస్థ సూచించిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించేట్లు చూడాలి. జాతీయ భూకంపాల నష్ట నివారణ పథకం 2013లోని మార్గదర్శకాలు విధిగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే సాంకేతిక పరిజ్ఞానానికి మానవ ప్రయత్నం, నష్ట నివారణ చర్యలు తోడై భూమండలానికి పొంచి ఉన్న పెను భూకంపాల ముప్పు నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు!

- మనస్వి
Courtesy : ఈనాడు 

ట్టణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబాటు చాటిన చంద్రబాబు ప్రభుత్వం, విస్తృత కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. రూ.9,700కోట్లకు పైగా అంచనా వ్యయంతో సుమారు లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా మార్గం సుగమమైంది. అందులో లక్షన్నర బహుళ అంతస్తుల నివాసాలు పోను, తక్కినవి లబ్ధిదారుల సొంత స్థలంలో కట్టనున్న విడి ఇళ్లు. సమకూర్చుకున్న ఇంటి జాగా ఉండీ ఆర్థిక సత్తా కరవైన వ్యక్తులు, బ్యాంకు రుణం రూ.90వేలు సహా మొత్తం లక్షరూపాయలు భరించగలిగితే- రాష్ట్రప్రభుత్వం లక్ష, కేంద్రం మరో లక్షన్నర రూపాయల మేర సబ్సిడీగా సమకూరుస్తాయంటున్నారు. నిర్మాణ బాధ్యత లబ్ధిదారులదే! బహుళ అంతస్తుల ఇళ్లకైతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సబ్సిడీ చెరో లక్షన్నరకు అదనంగా లబ్ధిదారులపై పడే భారం రూ.2.5లక్షలు. అందులో రెండు లక్షల 40వేల రూపాయలదాకా బ్యాంకు రుణంగా పొందగల వీలుండటం- గూడు లేని పట్టణ పౌరులకు గొప్ప వూరట. మొత్తం పథకం అమలుకయ్యే వ్యయభారంలో లబ్ధిదారుల నికర వాటా సుమారు 42శాతం; రాయితీ రూపేణా కేంద్రం దాదాపు 30శాతం, తక్కింది రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కలు నిక్కచ్చిగా కనిపిస్తున్నా, లబ్ధిదారుల ఎంపిక లగాయతు పారదర్శక వ్యవహార సరళి- పథకం సాఫల్యానికి ప్రాణావసరం. కాంగ్రెస్‌ పదేళ్ల ఏలుబడిలో కోటి గృహాల నిమిత్తం మంజూరైన రూ.42వేల కోట్లలో ఖర్చుపెట్టింది రూ.12వేల కోట్లేనని, అందులో మూడోవంతుకు పైగా దళారుల పాలబడిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కట్టామన్న పద్నాలుగున్నర లక్షల ఇళ్లకు ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లూ లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్వయంగా చెప్పిందే. కొత్తగా తలపెట్టిన పట్టణ గృహనిర్మాణ యోజనలో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకూ తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే, ప్రాథమిక గండం గడచి గట్టెక్కినట్లు!
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గృహనిర్మాణం తలపెట్టినా సింగపూర్‌, హాంకాంగ్‌, చైనాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవాలని అధికార యంత్రాంగానికి ఆరునెలల క్రితమే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇళ్లనిర్మాణం వేగంగా పూర్తవ్వాలని, నాణ్యంగా ఉండాలని గిరిగీశారు. ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ నమూనా దేశానికే ఆదర్శప్రాయం కావాలన్న ఆయన మనోవాంఛా ఫలసిద్ధి కోసం, అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి. టెండర్ల ప్రక్రియ ద్వారా గుత్తేదారులకు బహుళ అంతస్తు నిర్మాణాల బాధ్యత దఖలుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ దశలోనూ అవినీతి చొరబడకుండా కాచుకోవడంతోపాటు, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణతోనే పథకం సజావుగా సాగుతుంది. కనీస జాగ్రత్తల్ని గాలికి వదిలేస్తే వాటిల్లే దుష్పరిణామాలను ‘రాజీవ్‌ స్వగృహ’ రసాభాస ఇప్పటికే కళ్లకు కట్టింది. మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్‌ ధరకన్నా 25శాతం తక్కువకే ఇళ్లు కట్టిస్తామంటూ నాడు వై.ఎస్‌. సర్కారు ఆడంబరంగా ఆరంభించిన పథకమది. ఆ ఇళ్లను ఇప్పుడెవరూ కొనేవారు లేక వేల సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయి. తాగునీరు, రహదారులు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా కట్టిన ఆ ఇళ్లలో పాదం మోపేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు పట్టణ నిధులు వెచ్చించే వీల్లేక అనేక స్వగృహాలు కొరతల కొలిమిలో కుములుతున్నాయి. పకడ్బందీ ప్రణాళిక కరవై నిరుపయోగంగా మిగిలిన వేలాది ‘రాజీవ్‌ స్వగృహ’ నిర్మాణాల తరహా బాగోతాలు పునరావృతం కాకుండా, రాష్ట్రప్రభుత్వం అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది!
రాష్ట్రంలో గూడులేని ఆరు లక్షల మంది నిరుపేదలు, అల్పాదాయ వర్గాల వారికోసం మొత్తం రూ.16వేలకోట్ల అంచనా వ్యయంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం స్వీయ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏడు వారాల క్రితం ప్రకటించారు. లక్ష్యసాధనలో విదేశాల సాంకేతిక ఒరవడిని అందిపుచ్చుకోవాలని అభిలషిస్తున్న ఆయన ప్రభుత్వం, ఆయా విజయగాథల వెనక అపారకృషి తాలూకు ప్రాముఖ్యాన్ని సంపూర్ణంగా ఆకళించుకోవాలి. ప్రజలందరికీ సొంతిళ్లు కల్పించిన అతికొద్ది దేశాల్లో ఒకటైన సింగపూర్‌ నిర్మాణ ప్రణాళిక వైశిష్ట్యం సాటిలేనిది. గృహసముదాయాలకు చేరువలో విద్యాలయాలు, పార్కులు ఏర్పరచి, ప్రధాన రహదారులతో అనుసంధానించి, పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదభరితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో- ముందుచూపు, అంతకుమించి కళాత్మకత ఉట్టిపడతాయి. బహుళ అంతస్తుల పరిసర ప్రాంతాల సుందరీకరణకు స్థానికులు చొరవ చూపితే, తామే నిధులందించడం గృహవసతి పట్ల సింగపూర్‌ ప్రభుత్వ విశేష ప్రాధాన్యాన్ని చాటుతుంది. సత్వర పరిపూర్తి స్ఫూర్తికి పెద్దపీట వేయాలని నినదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇక్కడి గృహనిర్మాణ పథకాలన్నింటికీ తొలుత మౌలిక సదుపాయాల పరికల్పన పూర్తయ్యాకనే- పనులకు పచ్చజెండా వూపడం మేలు. గుత్తేదారుల ప్రమేయం కలిగిన సర్కారీ పథకాల ఇంపుసొంపులపై వేరే ప్రస్తావించనక్కర్లేనంతగా లొసుగుల బాగోతాలెన్నో తెలుగు గడ్డపై పోగుపడి ఉన్నాయి. ఆ దృష్ట్యా, పనుల నాణ్యతపై సరైన పర్యవేక్షణను రాష్ట్రప్రభుత్వం ఎంత మాత్రం అలక్ష్యం చేసే వీల్లేదు. రాయితీల రూపేణా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సౌహార్దం, లబ్ధిదారుల శ్రమఫలాలతో ముడివడిన ప్రతిష్ఠాత్మక గృహనిర్మాణమిది. ఇందులో ప్రతి ఒక్క రూపాయీ సద్వినియోగమయ్యేలా పటిష్ఠ కార్యాచరణ వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం సవ్యంగా పట్టాలకు ఎక్కించాలి!
Courtesy : ఈనాడు 

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.