June 2016

వ్యర్థాలపై సమర్థ వ్యూహం!
‘కాదేదీ పునశ్శుద్ధికి అనర్హం’ అనుకుంటూ ఎన్నో దేశాలు వ్యర్థాలనూ సమర్థ వనరులుగా మలచుకుంటుంటే, ఆ విషయంలో ఇండియా వెనకబాటు అనేక అనర్థాలకు దారితీస్తోంది. అధునాతన జీవనశైలి కారణంగా ఏటికేడు పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వ్యర్థాల (ఈ-వ్యర్థాల) పునశ్శుద్ధిని పెద్ద పరిశ్రమగా వృద్ధిచేసిన దక్షిణ కొరియా, యూకే, జపాన్‌, నెదర్లాండ్స్‌ లాంటివి అగ్రరాజ్యమైన అమెరికానే తలదన్ని దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఈ-వ్యర్థాల పునశ్శుద్ధి 40శాతానికి చేరగా, ఆ నాలుగూ 50నుంచి 80శాతం దాకా సాధిస్తూ అబ్బురపరుస్తున్నాయి. నవీన జీవనశైలికి సంకేతాలైన పలు వస్తూత్పాదనలు కొన్నాళ్ల వినియోగానంతరం ఈ-వ్యర్థాలుగా మారి దేశ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి గడ్డుసవాళ్లు విసరుతున్నాయి. పాతబడిన కంప్యూటర్లు, టీవీలు, చరవాణులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు లాంటివి దేశంలో కుప్పలుతెప్పలుగా పోగుపడుతున్నాయి. ఇండియాలో ఏటా అలా ‘ఉత్పత్తవుతున్న’ వ్యర్థాల రాశి ఎకాయెకి 18.5లక్షల టన్నులు. దిగ్భ్రమపరచే ఈ గణాంకాలు, భారత్‌ పోనుపోను ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతోందో చాటుతున్నాయి. ఏడాదికి 1.2లక్షల మెట్రిక్‌ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో ముంబయి నగరం ‘ముందంజ వేస్తోంది’. దిల్లీ(98వేల టన్నులు), బెంగళూరు (92వేలు), చెన్నై (67వేలు) కోల్‌కతా (55వేలు), అహ్మదాబాద్‌ (36వేలు), హైదరాబాద్‌ (32వేలు) నగరాల్లోనూ భారీగా ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అసోచామ్‌, కేపీఎమ్‌జీ సంస్థల సంయుక్త అధ్యయనం తాజాగా వెల్లడించింది. దేశంలో అలా ఉత్పత్తవుతున్న ఈ-వ్యర్థాల్లో కేవలం 2.5శాతమే రీసైక్లింగుకు నోచుకుంటున్నాయన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. లక్షల టన్నుల మేర పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు నేలను, నీటిని, గాలిని విషకలుషితం చేసేస్తున్నాయి. వాటివల్ల మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని, పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యమూ ఏర్పడుతుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో- దిద్దుబాటు వ్యూహాలు చురుగ్గా పదును తేలాల్సి ఉంది!
అత్యధికంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తరవాతి స్థానం ఇండియాదేనని ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఏడాది క్రితం ధ్రువీకరించింది. మూడేళ్ల వ్యవధిలో విశ్వవ్యాప్తంగా ఈ-వ్యర్థాల పరిమాణం 21శాతం దాకా విస్తరించనుందనీ ఆ నివేదిక హెచ్చరించింది. ఏదైనా కొత్త వస్తూత్పాదన విపణిలో పాదం మోపిందే తడవుగా దాన్ని సొంతం చేసుకోవాలన్న మోజు, వేలంవెర్రి పోటీ ఇంతలంతలైన వాతావరణం దృష్ట్యా- దేశీయంగా మరింత ప్రమాదం నెత్తిన ఉరుముతోంది. ఇప్పటికే వందకోట్లకు పైబడి చరవాణులు ఉపయోగిస్తున్న భారత్‌లో, ఏటా దాదాపు నాలుగోవంతు ఈ-వ్యర్థాల బాట పడుతున్నాయి. ఇంకో మూడేళ్లలోనే భారతగడ్డ మీద సంవత్సరానికి 30లక్షల టన్నుల దాకా వ్యర్థాల ఉత్పత్తి నమోదు కానుందని ‘అసోచామ్‌’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) భవిష్యద్దర్శనం చేస్తోంది. ప్రస్తుతం ఎడాపెడా వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాల్లో సింహభాగం ప్రధానంగా అసంఘటిత రంగానికే చేరుతోంది. వాటిని పునశ్శుద్ధి చేసే నైపుణ్యం, అందుకు అవసరమైన శిక్షణ కొరవడి బడుగు కార్మికులు, పేద పిల్లలు హానికర రసాయనాలూ అవశేషాల కారణంగా మహమ్మారి వ్యాధుల పాలబడుతున్నారు. అటు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ, ఇటు అసంఖ్యాక అభాగ్యుల బతుకుల్ని కర్కశంగా కాటేస్తున్న ఈ-వ్యర్థాల నియంత్రణపై ప్రజల భాగస్వామ్యానికి ప్రోదిచేసే పటుతర కార్యాచరణ తక్షణావసరం. ఈ కీలకాంశానికి సమధిక ప్రాముఖ్యం చేకూరితేనే, ‘స్వచ్ఛభారత్‌’ స్ఫూర్తి సంపూర్ణ ఫలితాలను ఒడిసిపట్టగలదన్నది యథార్థం.
హానికరమైన వ్యర్థ పదార్థాల దిగుమతిని నిషేధిస్తూ బాసెల్‌ ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ ఒకటి. స్వదేశంలో పద్ధతి ప్రకారం పునశ్శుద్ధి కార్యక్రమాలు చేపట్టేకన్నా గప్‌చుప్‌గా ఆసియాకో ఆఫ్రికాకో తరలించేస్తే ఎంతో మిగులు అన్న సంపన్న రాజ్యాల దుస్తంత్రం పుణ్యమా అని, ఆ ఒప్పందం నిలువునా నీరుగారుతోంది. ఆఫ్రికాలో ఘనా, నైజీరియాలకు; ఆసియాలో చైనా, మలేసియా, పాకిస్థాన్లతోపాటు భారత్‌కు ఈ-వ్యర్థాల అక్రమ రవాణా ఏటికేడు పోటెత్తుతోంది. ఈ-వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసమంటూ 2011లో క్రోడీకరించిన నిబంధనల అమలు బాధ్యతను యూపీఏ జమానా గాలికొదిలేసింది. పది వారాల క్రితం నూతన నిబంధనావళిని గెజెట్‌లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం- వస్తూత్పాదకులు, డీలర్లు, రాష్ట్రప్రభుత్వాల ఇదమిత్థ బాధ్యతల్ని రెండో ప్రకరణంలో పేర్కొంది. వాటిపై విస్తృత జనచేతన పెంపొందించడంతోపాటు ఈ-వ్యర్థాల సేకరణ, నిర్వహణలకు రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్లను ఆయత్తపరచడం ప్రజాప్రభుత్వాల విహిత బాధ్యత! నిర్ణీత గడువు ముగియడంతోనే విక్రయదారులే ఈ-వ్యర్థాలను వెనక్కి తీసుకునే పద్ధతి నార్వేలో దశాబ్దం కాలంగా అమలవుతోంది. పాత టీవీలు తదితరాల్ని పౌరులు, స్వచ్ఛంద సంస్థలు పునర్వినియోగ కేంద్రాలకు తరలించే సంస్కృతి స్వీడన్‌లో వేళ్లూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశంగా అవతరించిన స్వీడన్‌ అనుభవాలు, దేశీయ వ్యూహాలకు ఒరవడి దిద్దాలి. వెలుపలి నుంచి అక్రమ తరలింపులు వెల్లువెత్తకుండా కాచుకుంటూ, క్రమేణా పునశ్శుద్ధి కేంద్రాలను విస్తరించే ద్విముఖ ప్రణాళికను సజావుగా పట్టాలకు ఎక్కించడమే- వ్యర్థాల సమస్యకు సరైన విరుగుడు అవుతుంది!


పొరుగు దేశాలతో రాదారి బంధం 
ఈశాన్య భారతానికి వరం 
భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ద్వారా ఆగ్నేయాసియాతో పాటు మనదేశంలోని వెనకబడిన ఈశాన్య ప్రాంత ముఖచిత్రం మారిపోనుంది. ఈ రహదారి ఫలితంగా మౌలిక వసతులు పెరిగి చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కలగనుంది. మూడు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ రహదారి మణిపూర్‌లోని మోరె నుంచి మియన్మార్‌లోని టము, మాండలే నగరం మీదుగా థాయ్‌లాండ్‌లోని మాయోసోట్‌ జిల్లా టాక్‌ వరకు విస్తరించేలా ప్రణాళిక రచించారు. దీనిపై వాహనాల ప్రయాణానికి అవసరమైన త్రైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందం కోసం మూడు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ నుంచి ఈ మార్గం మీదుగా ఫార్మా, యంత్రాలు, యంత్రపరికరాలు, ప్లాస్టిక్‌, వాహనాలు, పత్తి ఎగుమతి చేస్తారు. రహదారి మొత్తం పొడవు 1,400 కిలోమీటర్లు. మొదటి దశలో 78 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. మియన్మార్‌లోని 73వంతెనలను భారత్‌ నిధులతో ఆధునీకరిస్తున్నారు. మరో 400 కిలోమీటర్ల రహదారిని ఆధునీకరిస్తారు. భారత్‌కు చెందిన సరిహద్దు రహదారి సంస్థ మియన్మార్‌లోని టము-కలెవ్వా-కలెమై రహదారిని ఇప్పటికే అభివృద్ధి చేసింది. మొదటిదశలో 192, రెండోదశలో వంద కిలోమీటర్ల రహదారిని థాయ్‌లాండ్‌ అభివృద్ధి చేయనుంది. ఏడాదిన్నర వ్యవధిలో రహదారి పనులు పూర్తి కాగలవని భావిస్తున్నారు. మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాలో గల మోరె పట్టణం మియన్మార్‌ సరిహద్దుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా మోరెకు పేరుంది.
వాణిజ్యానికి కొత్త వూపు 

తొంభయ్యో దశకంలో పీవీ నరసింహారావు హయాములో ప్రారంభమైన ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని తరవాత వచ్చిన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో ద్వైపాక్షిక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని ‘యాక్ట్‌ ఈస్ట్‌’గా మార్చి అభివృద్ధికి దారులు పరుస్తోంది. అధికారం చేపట్టగానే 2014 నవంబరులో మోదీ మియన్మార్‌ సందర్శించారు. భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి వెనక భారత్‌ చొరవ ఉంది. భారత ఈశాన్య ప్రాంతం ఆగ్నేయాసియాకు ముఖద్వారం వంటిది. బంగ్లాదేశ్‌, చైనా, భూటాన్‌, మియన్మార్‌ సరిహద్దులు గల ఈశాన్య ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకింత భిన్నంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు విస్తృత సహజ వనరులకు నిలయాలు. అపారమైన జల వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే జలవిద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ ఉపయోగపడుతుంది. అవసరాలకు పోగా మిగిలినది పొరుగు దేశాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. దేశం మొత్తం వెదురులో 28శాతం ఈ ప్రాంతం నుంచే లభిస్తుంది. ఇందులో మిజోరాం ముందుంది. వెదురు ఉత్పత్తిలో భారత్‌ ఆసియాలో రెండోస్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏటా 46వేల టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా రబ్బరు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. రబ్బరు సాగును ప్రోత్సహించడం ద్వారా 2017నాటికి సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని భారత రబ్బరు సంస్థ ప్రతిపాదించింది. తేయాకు సాగుకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి. అసోమ్‌లో తేయాకు అత్యధికంగా సాగు చేస్తారు. దేశంలో 50శాతానికి పైగా ఉత్పత్తి ఇక్కడి నుంచే లభిస్తోంది. మానవ వనరులకు కొరత లేదు. ఈ నేపథ్యంలో తేయాకు, రబ్బరు, వెదురు ఆధారిత చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.

మియన్మార్‌ చూడటానికి చిన్న దేశమే కావచ్చు. కానీ, అపారమైన సహజ వనరులకు అది నిలయం. విస్తృత తీరప్రాంతంతో పాటు సారవంతమైన నేలలకు కొదవ లేదు. ఈ ఆగ్నేయాసియా దేశంతో మొదటినుంచీ మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అంగ్‌సాన్‌ సూచీ ప్రజాస్వామ్య ఉద్యమానికి అండగా నిలిచింది. అదే సమయంలో సైనిక పాలకులతో కూడా సత్సంబంధాలు నెరపింది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటోంది. బంగాళాఖాతం తీరప్రాంతం కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మియన్మార్‌ వాసులతో సత్సంబంధాలు ఉన్నాయి. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల మధ్య మియన్మార్‌ వారధి లాంటింది. మణిపూర్‌లోని మోరె, ఇంఫాల్‌ నుంచి మియన్మార్‌లోని రెండో అతి పెద్ద నగరమైన మాండలేల మధ్య బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన నేటికీ కార్యరూపం దాల్చలేదు. గతంలో మణిపూర్‌, నాగాలాండ్‌లకు చెందిన కొన్ని తిరుగుబాటు బృందాలు మియన్మార్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాయి. ఆ దేశంతో సత్సంబంధాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదానికి కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. థాయ్‌లాండ్‌ తరవాత మన దేశమే మియన్మార్‌కు అతిపెద్ద మార్కెట్‌. ఆ దేశ ఎగుమతుల్లో పాతిక శాతం భారత్‌కే వస్తున్నాయి. వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, చమురు, సహజవాయువు, ఆహారశుద్ధి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. పెద్దసంఖ్యలో మియన్మార్‌ వాసులు అనధికారికంగా ఈశాన్య రాష్ట్రాల్లో నివసిస్తూ ఉపాధి పొందుతున్నారు. నిన్న మొన్నటి దాకా సైనిక పాలనతో విసిగిపోయినవారికి స్వదేశంకన్నా భారత్‌లోనే తమకు మంచి భవిష్యత్తు ఉందని వారు భావిస్తున్నారు. మియన్మార్‌కు భారత్‌ నాలుగో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. థాయ్‌లాండ్‌, సింగపూర్‌, చైనా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బహుళ ప్రయోజనాలు 

దశాబ్దాల సైనిక పాలన నుంచి ఇటీవలే ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన మియన్మార్‌లో వాణిజ్యావకాశాలు, పునర్నిర్మాణ పనులపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. మొదటి నుంచీ మియన్మార్‌పై కన్నేసిన చైనా ఈ విషయంలో భారత్‌కన్నా ముందే ఉంది. భారత్‌ కాస్త ఆలస్యంగా మేలుకుంది. మే మూడోవారంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మియన్మార్‌లో పర్యటించారు. భారత్‌కు చెందిన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తోంది. దశాబ్దాల పాటు మియన్మార్‌ సైనిక పాలనలో ఉన్నందువల్ల ఆ దేశంతో మన వాణిజ్యం తక్కువే. దానికితోడు సైనిక పాలకులపై చైనా ప్రభావం కారణంగా చెప్పుకోదగ్గ వాణిజ్యం జరగలేదు. 2020నాటికి వెయ్యి కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడటం, పునర్నిర్మాణ పనులపై అక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టడం వల్ల మున్ముందు వాణిజ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. తాజా రహదారి వల్ల నేరుగా రాకపోకలు సాగించేందుకు; ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. థాయ్‌లాండ్‌తోనూ మనకు సత్సంబంధాలే ఉన్నాయి. 2014లో ఇరుదేశాల మధ్య 800కోట్ల డాలర్ల మేర వాణిజ్యం జరిగింది. 2015లో ఇది 1,200కోట్ల డాలర్లకు పెరిగింది. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన థాయ్‌లాండ్‌ను నిరుడు పది లక్షల మందికి పైగా భారతీయ పర్యాటకులు సందర్శించారని అంచనా. తాజా రహదారి వల్ల వాణిజ్యంతోపాటు పర్యాటకుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యావకాశాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి దోహదపడే భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ఎంత త్వరగా కార్యరూపం దాలిస్తే అంత మంచిది!

- గోపరాజు మల్లపరాజు

అంతర్జాలమే తరగతి గది! 
ఉన్నత విద్యలో తొలగుతున్న దూరాభారాలు 
న్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ఓ కీలక సమావేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఉపాధ్యక్షులు చేసిన ప్రకటన ఆ మేరకు నిర్దిష్ట సంకేతాలు అందించింది. దేశంలోని 850కిపైగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కొత్త మార్పులు అందిపుచ్చుకొనేందుకు సమాయత్తం కావాలన్న ‘యూజీసీ’ పిలుపు ఒకరకంగా ‘వర్సిటీల’ మొద్దునిద్ర వదిలించేదే! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అభ్యసించడానికి వీలుగా ‘ఆన్‌లైన్‌ కోర్సు’లు రూపొందించాలన్న అంశంపై ఆ సమావేశం ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘మూక్స్‌’ తరహాలో యువత కోసం ‘స్వయం’ పోర్టల్‌ను మానవ వనరులశాఖ ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కోర్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దారిచూపిన పశ్చిమ దేశాలు
అంతర్జాల విద్యకు సంబంధించి విదేశాలు భారత్‌తో పోలిస్తే ఎంతో ముందున్నాయి. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన ‘కోర్స్‌ఎరా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా అనేక రకాల కోర్సులు చదువుకోగల అద్భుత అవకాశం ఆవిష్కృతమైంది. సుమారు 20కిపైగా ఉన్న ఇలాంటి అంతర్జాలయ విద్యాసంస్థల్లో అధికంగా నమోదు చేసుకుంటున్నవారిలో అమెరికన్లది తొలిస్థానం. రెండో స్థానంలో భారతీయులు ఉండటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక, మానవీయ శాస్త్రాల్లోనూ ఈ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఒకేచోట తరగతి గదులు, బోధన కార్యకలాపాల నిర్వహణ అనే పద్ధతిని ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌ వంటి సంస్థలు సమూలంగా మార్చివేశాయి. ఈ విద్యాసంస్థలు అందించే కోర్సులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అందిపుచ్చుకొంటున్నారు.

సరికొత్త పోకడ 

భారత ప్రభుత్వం నూతన విద్యావిధానం ఆవిష్కరించడానికి ముందే రెండు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒకటి ఐచ్ఛికంగా ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతి. రెండోది- అంతర్జాలం ద్వారా విద్యార్జన మార్గాలకు ద్వారాలు తెరచుకోవడం. విద్యార్థులు తాము ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతిలో ప్రధాన పాఠ్య విభాగాలతోపాటు, వారికి ఆసక్తి ఉన్న లేదా అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఉపకరించే అంశాలను మొత్తం కోర్సులో 20శాతం మేర ఎంపిక చేసుకునే అవకాశం అతి త్వరలో రాబోతోంది. ఇక ఉన్నత విద్యలో అంతర్జాల కోర్సులకు ఆదరణ క్రమేపీ పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం ఆరున్నర లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఎడక్స్‌, కోర్స్‌ఎరా వంటి అంతర్జాల కోర్సులు అందించే సంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యను అభ్యసించడంలో యువతలో మారుతున్న అభిరుచికి ఇది సంకేతం. పేర్లు నమోదు చేసుకున్నవారిలో నేరుగా తరగతి గదులకు హాజరవుతున్న విద్యార్థులూ లక్షల సంఖ్యలో ఉండటం కొత్త కోణం. ఒకరకంగా ఇది మంచి పరిణామం. నేటి యువతకు సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో ప్రావీణ్యం తప్పనిసరి అవసరం అయింది. వారి అభ్యసన, ఉద్యోగ, దైనందిన అవసరాల్లో ఈ అప్లికేషన్ల వినియోగం అనివార్యంగా మారుతోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా విధానకర్తలను, విద్యావేత్తలను ప్రేరేపిస్తున్న పరిణామమిది. రాన్రాను అంతర్జాల బోధన, అభ్యసనలకు ఉన్నత విద్యావ్యవస్థలో చోటు పెరుగుతోంది. అభ్యసిస్తున్న డిగ్రీల్లో ఇరవై శాతానికి సమానమైన అంతర్జాల కోర్సులను గుర్తింపు పొందిన ఇతర విశ్వవిద్యాసంస్థల నుంచి పొందవచ్చునని యూజీసీ విధాన నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ప్రకటన వెలువడటమే తరువాయి. విద్యావ్యవస్థను సాంకేతిక పథం తొక్కిస్తున్న ఈ పరిణామాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. హైస్కూలు నుంచి విశ్వవిద్యాలయాల వరకు అనేక కోర్సులను ముఖాముఖి పద్ధతిలో విన్న అనుభూతి కలిగించే విధంగా అంతర్జాలం ద్వారా రకరకాల కోర్సులు అందించేందుకు యూజీసీ కృతనిశ్చయంతో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌పీటీఈఎల్‌ (సాంకేతిక విజ్ఞానంతో అభ్యసనను కొనసాగించే జాతీయ కార్యక్రమం) 23 పాఠ్యాంశాల్లో సుమారు తొంభైకిపైగా కోర్సులు అందిస్తోంది. యూజీసీ ప్రయోగానికి వూపునిచ్చే పరిణామమిది.
సాంకేతిక విజ్ఞాన సాయంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గట్టి సవాలే. అయితే, విద్యారంగం ఏనాటి నుంచో ఎదుర్కొంటున్న మరో నాలుగు సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చించుకోవాల్సి ఉంది. అవి: అందరికీ అందుబాటులో విద్య, చదువుల్లో నాణ్యత, సమకాలీన అవసరాలకు తగిన విద్య, సమృద్ధిగా నిధులు. ఈ నాలుగూ దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు. ఇటీవలి అధ్యయనాల్లో దేశంలో కేవలం 23శాతం విద్యార్థులు మాత్రమే వయసుకు తగిన విద్య అభ్యసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మరోవంక నాణ్యమైన విద్యకు సంబంధించి జవాబులు వెదకాల్సిన ఎన్నో ప్రశ్నలు మనముందున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగిన విద్య అందించడంలోనూ వెనకబాటు కనిపిస్తోంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సుమారు ఎనభైశాతం నిరుద్యోగులుగానే మిగిలిపోతుండటం శోచనీయం. ప్రమాణాలు పెంచేందుకు తగినన్ని ఆర్థిక వనరులు లభించకపోవడం బాధ కలిగించే విషయం. ఆర్థిక వనరుల సమస్య ఈనాటిది కాదు. అది 1968నుంచీ ఉన్న పరిస్థితే. నిధుల కేటాయింపులో 1998నుంచి కొంత పెరుగుదల ఉన్నప్పటికీ కాలంతోపాటు పెరుగుతున్న సవాళ్ల స్థాయికి తగినట్లుగా మాత్రం అవి లేవు.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నాసిరకం విద్య అందించడంలో పోటీపడుతున్నాయి. అడుగంటుతున్న విద్యా ప్రమాణాలు ప్రభుత్వాన్నే నిర్ఘాంతపరుస్తున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఆచరణలో ఎంతగా విఫలమవుతుందో కళ్లకు కనిపిస్తూనే ఉంది. వ్యవస్థలోని లోపాలను ఎక్కడికక్కడ అలాగే ఉంచి, కళాశాలల్లో తనిఖీలకు ప్రభుత్వ యంత్రాంగం పరిమితమవుతుండటం పతనమవుతున్న ప్రమాణాలకే నిదర్శనం. విద్యార్థులు విషయాలను అవగతం చేసుకుని, నేర్చుకొనే పద్ధతుల్లోనూ ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు భారతీయ సమాజంలో వెన్వెంటనే అంతర్భాగంగా మారిపోతున్నాయి. సమస్యను సరైన కోణంలో అర్థంచేసుకొని పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత- విద్యావేత్తలది, విధానకర్తలది! బోధన, అభ్యసనల్లో నాణ్యత అన్నవి పరస్పరం ప్రభావితమయ్యే అంశాలు. బోధన రంగంలో ఆశించిన మార్పులు తీసుకురావడం అనుకున్నంత తేలిక కాదు. బోధనలో నాణ్యత పెంచడానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఓపెన్‌, దూరవిద్య విధానాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. సమాచార సాంకేతిక ఆధారిత బోధన పద్ధతులూ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞాన ఆగమనంతో విద్యార్జనలో నూతన శకం మొదలైంది. భారత ప్రభుత్వం ఇటీవల ‘ఈ-పాఠశాల’కు అంకురారోపణ చేయడం ద్వారా బహుముఖ కోణాల్లో జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో తరగతుల నిర్వహణకు తగిన సాధన సంపత్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
కాలానుగుణ మార్పులు 

పదేళ్ల క్రితమే భారత్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు ఈ తరహా కోర్సులను అంతర్జాలం ద్వారా అందించడం ప్రారంభించాయి. విద్యాబోధనలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మార్పులను, ఆయా రంగాల్లో వస్తున్న నూతన ధోరణులను గమనించి కాలానుగుణంగా కోర్సులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. సాంకేతిక విజ్ఞాన సాయంతో పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటున్నాయి. కాలంతోపాటు వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఈ కోర్సుల్లో భాగం చేయాలి. ఆ రకంగా నేటితరానికి అంతర్జాల విద్యాకోర్సులు తిరుగులేని వరాలుగా మారబోతున్నాయి. ఆయా రంగాల్లో ఆధునిక మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు కోర్సులను నవీకరించడం ఎంతో అవసరం. అంతర్జాల విద్యావిధానం ప్రపంచాన్ని పలకరించి ఇప్పటికే దశాబ్దం దాటిపోయింది. అన్ని వయసులవారూ ఈ పద్ధతి ద్వారా విద్య అభ్యసించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల బోధకులకూ ఎంతో వెసులుబాటు లభిస్తోంది. తాజా మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, తమను తాము నవీకరించుకునేందుకు ఈ ఆధునిక విద్యావిధానం వారికి అవకాశం ఇస్తోంది. విద్యార్థుల అభ్యసనం తీరుతెన్నులను నిర్దిష్టంగా మదింపు చేసి, వారిని మరింత సానపట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, పట్టికలు వంటి వనరులన్నీ ఒకేచోట లభించడంవల్ల, ఆయా అంశాలను నేర్చుకోవడం- ఆసక్తికరం, విజ్ఞానదాయకం! యూజీసీ సూచించబోయే నూతన విధానంలో విద్యార్థులు 60శాతం నుంచి 70శాతం వరకు పాఠ్యాంశాలకు సంబంధించిన మౌలిక విషయాలను సంప్రదాయ పద్ధతిలోనే నేర్చుకుంటారు. మిగిలిన 30శాతం పాఠ్యాంశాలను మారుతున్న అవసరాలకు తగిన నైపుణ్యాలను అలవరచుకునేందుకు ఉపకరించే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా నైపుణ్యాలను వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి విఖ్యాత సంస్థలు అందించే అంతర్జాల కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే నేర్చుకోవచ్చు. ఆ మేరకు సునాయాసంగా డిగ్రీలూ పూర్తిచేయవచ్చు. ఈ తరహా సమ్మిళిత కోర్సుల అభ్యసనంవల్ల పట్టాల విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ తరహా మార్పులను సమర్థంగా అమలు చేయాలంటే ఉన్నత విద్యాసంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరం. జ్ఞానాన్ని మించిన సంపద లేదు. అజ్ఞానంకంటే పేదరికంలేదు. గతిశీల ప్రపంచం నిరంతరం మనకందిస్తున్న విలువైన సూత్రమిది. దీన్ని ఆచరణలోకి మార్చుకోవడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం.
- ఆచార్య ఇవటూరి రామబ్రహ్మం


Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.