Articles by "INTERNATIONAL RELATIONS"

Showing posts with label INTERNATIONAL RELATIONS. Show all posts

జిత్తులమారి చైనా ఎత్తులు చిత్తు! 

వియత్నాం, తైవాన్‌లతో భారత్‌ దౌత్యబంధం 


చైనా విషయంలో భారత్‌ దూకుడు పెంచింది. వివిధ అంశాలపై ఇబ్బంది పెడుతున్న చైనాకు అదే స్థాయిలో, దానికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలని నిర్ణయించింది. భారత్‌లో పర్యటించడానికి తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని అనుమతించడం; వియత్నామ్‌కు బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు అమ్మేందుకు సిద్ధపడటం ఆ వ్యూహంలో భాగమే. దీనిపై చైనా తీవ్రస్థాయిలో స్పందించింది. భారత్‌ నిప్పుతో చెలగాటమాడుతోందని హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర వివాదం చైనా, వియత్నామ్‌ల మధ్య చిచ్చు రేపుతోంది. ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. సైనిక శిక్షణ, గస్తీ వాహనాల విషయంలో భారతదేశం ఇప్పటికే వియత్నామ్‌కు సహాయపడుతోంది. తాజాగా ఆ దేశానికి క్షిపణులు అమ్మేందుకు భారత్‌ ముందుకు రావడంతో చైనా కుతకుతలాడుతోంది. మరోవైపు తైవాన్‌ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడం చిన్న విషయమేమీ కాదు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ‘ఒకే చైనా’ విధానాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు అందుకు భిన్నంగా వెళ్తొందన్న వాదన వినిపిస్తోంది. ‘ఒకే చైనా’ విధానానికి కట్టుబడి ఉండాలని, తైవాన్‌తో ఎలాంటి అధికారిక సంబంధాలు కొనసాగించరాదన్న చైనా హెచ్చరికపై భారత్‌ గట్టిగానే స్పందించింది. తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని అనుమతించడం అసాధారణమైన చర్యేమీ కాదని తేల్చి చెప్పింది.

పాక్‌పై ప్రేమతోనే... 


మూడు కీలక అంశాలపై చైనా మొండిగా వ్యవహరిస్తుండటమే భారత్‌ విధానంలో మార్పునకు కారణంగా కనిపిస్తోంది. అణు సరఫరాదారుల బృందంలో భారత్‌ ప్రవేశాన్ని చైనా అడ్డుకుంటోంది. మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేలా ఐక్యరాజ్య సమితిలో భారత్‌ ప్రయత్నాలను నిష్ఫలం చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరు భూభాగం మీదుగా చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీపీఈసీ) నిర్మాణంపై మనదేశ అభ్యంతరాలను చైనా లెక్కచేయడం లేదు. జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ సహా భద్రతా మండలిలోని పద్నాలుగు దేశాలు సుముఖంగానే ఉన్నాయి. చైనా మాత్రం ‘వీటో’ అధికారంతో అడుగడుగునా అడ్డుతగులుతోంది. పాక్‌తో కుమ్మక్కు కావడం వల్లే చైనా అలా చేస్తోంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం విషయంలోనూ ఇలాగే జరిగింది. సియోల్‌ వేదికపై నిరుడు జూన్‌లో ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక ప్లీనరీ జరిగినప్పుడు భారత్‌ దరఖాస్తు పరిశీలనకు వచ్చింది. ఎన్‌ఎస్‌జీలోని మొత్తం 48 సభ్య దేశాల్లో 47 దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. చైనా ఒక్కటే అవరోధంగా మారింది. అన్ని దేశాలూ సమ్మతించాల్సి ఉండటంతో ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం నేటికీ అందని మానిపండుగానే మిగిలింది. భారత్‌ను చేర్చుకుంటే పాకిస్థాన్‌కు ప్రవేశం దక్కదేమోనని చైనా ఆందోళన చెందుతోంది. ఎన్‌ఎస్‌జీలో చేరితే, పాక్‌ ప్రవేశాన్ని అడ్డుకొనే అధికారం భారత్‌కు సంక్రమిస్తుంది. అది చైనాకు ఇష్టంలేదు. భారత్‌తో పాటు పాకిస్థాన్‌కూ ఎన్‌ఎస్‌జీలోకి ప్రవేశం కల్పించాలని చైనా కోరుతోంది. భారత్‌-చైనాల మధ్య కాకుండా, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్యే పోలిక తెచ్చే పరిస్థితి రావాలని బీజింగ్‌ కోరుకుంటోంది.
పాక్‌ ప్రమాదకర అణ్వాయుధ దేశం. ఏనాటికైనా అణ్వాయుధాలు ఉగ్రవాద శక్తుల చేజిక్కే ముప్పు అక్కడ ఉంది. అందుకే ఎన్‌ఎస్‌జీ ద్వారా పాక్‌కు అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడానికి అమెరికా అనుమతించడంలేదు. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం లభిస్తే భారత్‌ తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవచ్చునని, ఆ పరిస్థితి తనకు ప్రమాదకరమని చైనా భావిస్తోంది. పైగా భారత్‌కు ఒకసారి ఎన్‌ఎస్‌జీలో ప్రవేశం దక్కిందంటే, ప్రపంచ అణ్వాయుధ దేశంగా దానికి గుర్తింపు లభిస్తుంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్‌పీటీ)లో చేరకపోయినా, ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. మిగతా ప్రపంచంతో అణు వాణిజ్యం నిర్వహించడానికి భారత్‌కు అమెరికా మినహాయింపు ఇచ్చినందువల్ల అది సాధ్యమే. ఎన్‌పీటీలో చేరని ఇతర దేశాలైన పాకిస్థాన్‌, దక్షిణ సూడాన్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లకు మాత్రం అమెరికా ఇప్పటివరకు అలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం మీదుగా ఆర్థిక నడవా నిర్మాణంపై అభ్యంతరాలను చైనా ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదు. పాక్‌, చైనాలు ఆ ప్రాంతంలో జోరుగా మౌలిక వసతులు అభివృద్ధి పరుస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పార్లమెంటుకు తెలిపింది. చైనా కార్యకలాపాల పట్ల ఆ శాఖ ఎన్నోమార్లు ఆందోళన వ్యక్తపరచింది. అలాంటి చర్యలను విడనాడాలని కోరింది. వాటిని చైనా ఖాతరు చేయడం లేదు. ప్రపంచీకరణ పథంలో మరింత ముందుకు దూసుకుపోవాలంటే ఆర్థిక నడవా అత్యవసరమని చైనా భావిస్తోంది. ఈ ఆర్థిక నడవా పశ్చిమ చైనా, పశ్చిమాసియా, ఆఫ్రికాల మధ్య సన్నిహిత అనుసంధానానికి దోహదపడుతుందని, అందువల్లే 4,600 కోట్ల డాలర్ల ఈ పథకాన్ని చైనా చేపట్టిందని ఫోర్బ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌కు చెందిన భూభాగం మీదుగా ఈ నడవాను నిర్మిస్తుండటమే అభ్యంతరకరం. ఈ విషయంలో భారత్‌ మాట వినే పరిస్థితిలో చైనా లేదు. ఈ పథకం అమలులో వేగంగా ముందుకెళ్తొంది. దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో అమెరికావైపు భారత్‌ ఎందుకు నిలబడాల్సివచ్చిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. చైనా కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్నందువల్లే ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో అనేక దేశాలను చైనా ఇప్పటికే దూరం చేసుకుంది. ‘ఆసియాన్‌’లోని పది దేశాలతోనూ వైరం తెచ్చుకుంది. జపాన్‌తోనూ గొడవపడుతోంది. చైనాను అదుపు చేయడంలో భాగంగా ఆ దేశాలన్నింటికీ భారత్‌ ఇప్పుడు స్నేహహస్తం చాస్తోంది. ముఖ్యంగా, చైనా అంటేనే భగ్గుమంటున్న వియత్నామ్‌తో భారత్‌ మైత్రి చాలా కీలకమైంది. చైనాపై ఒత్తిడి పెంచి, నియంత్రించాలంటే వియత్నామ్‌ వంటి దేశాలతో బంధాన్ని దృఢపరచుకోవడమే మార్గమని భారత్‌ గుర్తించింది. అందుకే నౌకా, వైమానిక దళ సామర్థ్యాల్ని పెంపొందించుకునే విషయంలో వియత్నామ్‌కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఆకాశ్‌, బ్రహ్మోస్‌ క్షిపణుల అమ్మకానికి సిద్ధపడింది. భారత్‌, వియత్నామ్‌ల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. 45 ఏళ్లుగా దౌత్య సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. 2014లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వియత్నామ్‌లో పర్యటించారు. ఆయుధ సామగ్రి కొనుగోలు కోసం వియత్నామ్‌కు 10 కోట్ల డాలర్ల దాకా సహాయం అందజేయడానికి ఆ సందర్భంగా భారత్‌ అంగీకరించింది. నిరుడు ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్‌ (వియత్నాం రాజధాని) పర్యటనలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ భారత్‌, వియత్నాం సంబంధాల కీలక ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు.
సవాలుకు సరైన జవాబు 

తైవాన్‌తో భారత్‌ అధికారిక సంబంధాలు చైనాను చికాకు పరుస్తున్నాయి. తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడంతో చైనా ఇరకాటంలో పడింది. తైవాన్‌ తన భూభాగమేనని, ఏదో ఒకనాటికి తమదేశంలో విలీనమై తీరుతుందని చైనా అంటోంది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించకుండా, దాంతో సహా మొత్తం చైనాను ఒకే దేశంగా గుర్తించడమే- ‘ఒకే చైనా’ విధానమంటే! 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసినప్పటినుంచీ కొనసాగుతున్న విధానమది. ఆ యుద్ధంలో ఓడిపోయిన జాతీయవాదులు (కొమింటాంగ్‌) తైవాన్‌కు పారిపోయి, అక్కడ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన కమ్యూనిస్టులు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరిట ప్రధాన భూభాగాన్ని పాలించసాగారు. చైనాకు అసలైన ప్రతినిధులం తామేనని ఉభయపక్షాలూ చెప్పుకోవడం గమనార్హం. తైవాన్‌ కనుక అధికారికంగా స్వాతంత్య్రం ప్రకటించుకుంటే, బల ప్రయోగానికి పాల్పడాల్సివస్తుందని చైనా పాలక కమ్యూనిస్టుపార్టీ హెచ్చరిస్తోంది. కానీ, ఇటీవలి కాలంలో తైవాన్‌ పట్ల అది కొంత మెత్తగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్‌ను గుర్తించాయి. 1970 తరవాత అవి తైవాన్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుని, బీజింగ్‌కు దగ్గరయ్యాయి. తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలూ ఉన్నాయి. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించని దేశాలే ప్రపంచంలో అధికం. ఐక్యరాజ్య సమితి సైతం తైవాన్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దౌత్య సంబంధాల విషయంలో దెబ్బతిన్న తైవాన్‌, ఇరుగు పొరుగు దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మాత్రం కొనసాగించగలుగుతోంది. ఈ పరిస్థితుల్లో తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడం సహజంగానే చైనాకు ఆగ్రహం కలిగించింది. భారత్‌ చొరవ వల్ల తైవాన్‌తో సంబంధాలు బలపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకర్షణీయ నగరాలు, భారత్‌లో తయారీ కార్యక్రమాల్లో తైవాన్‌ నైపుణ్యపరమైన సహాయ సహకారాలు అందజేసే అవకాశం ఉంది. తన కంట్లో నలుసుగా మారిన తైవాన్‌తో భారత్‌లాంటి పెద్ద దేశం సన్నిహిత అధికారిక సంబంధాలు ఏర్పరచుకోవడం చైనాను చిర్రెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి తన పాకిస్థానీ ప్రేమే కారణమని బీజింగ్‌ నేటికీ గ్రహించకపోవడం విడ్డూరం. చైనా విసురుతున్న సవాళ్లకు ఏ రీతిన జవాబులు చెప్పాలో భారత్‌కు అర్థమైంది. ఇండియా ఇప్పుడు ఆ పనే చేస్తోంది!
- నీరజ్‌ కుమార్‌
Source : Eenadu (07-03-2017)

Editorial as Image format


Editorial as Pdf format

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.