స్వీయ రక్షణ... సర్వ భక్షణ! 
భారత్‌ను దెబ్బతీస్తున్న విశ్వవాణిజ్య యుద్ధం

 
రవై ఏళ్ల క్రితం కుదిరిన రోమ్‌ ఒడంబడిక అంచెలంచెలుగా ఐరోపా సమాఖ్య (ఈయూ), ఉమ్మడి కరెన్సీ యూరో ఆవిర్భవానికి దారితీసింది. ఇదేకాలంలో ప్రపంచీకరణ విస్తరించి ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్లూటీఓ) అవతరణకు తోడ్పడింది. డబ్ల్యూటీఓలో చైనా చేరికతో అంతర్జాతీయ వాణిజ్యం వేగం పుంజుకొంది. కానీ, 2008 ఆర్థిక సంక్షోభం ప్రపంచీకరణపై వ్యతిరేకత పెంచి ఈయూ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణకు, అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి మూలకారణమైంది. అంతర్జాతీయ వాణిజ్యం, సంబంధిత కార్యకలాపాల వల్ల తాము నష్టపోతున్నామనే భావన బ్రిటన్‌, అమెరికా ప్రజల్లో వేళ్లూనుకోవడం వల్ల ఈ పరిణామాలు సంభవించాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అందరూ బాగుపడతారు తప్ప, ఏ ఒక్కరో లబ్ధిపొందరన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించలేదని అమెరికా, బ్రిటన్‌ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అవాస్తవిక మనోభావాలు బ్రెగ్జిట్‌, ట్రంప్‌ విజయాలకు హేతువయ్యాయి. చిత్రంగా ట్రంప్‌ విజయం తరవాత విజేతలు, పరాజితులు; చిన్నా పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అందరికీ ఆదుర్దా పట్టుకొంది. భారతదేశమూ దీనికి మినహాయింపు కాదు. నేడు కీలక మలుపులో ఉన్న భారత ఆర్థిక భవిష్యత్తు అనిశ్చితికి లోనవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వాణిజ్య సమరానికి సిద్ధం కావడం దీనికి కారణం. డబ్ల్యూటీఓ నిర్ణయాలకు తలొగ్గాల్సిన అవసరం అమెరికాకు లేదని, ఒక సార్వభౌమ దేశంగా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తామని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఇటీవల స్పష్టీకరించడం పెద్ద అశుభ సంకేతం. అమెరికా ఇదే పంథాలో సాగితే ప్రపంచానికి 1930నాటి మహా కుంగుబాటు మళ్ళీ దాపురిస్తుంది. అప్పట్లో ప్రపంచ దేశాలు పోటాపోటీగా దిగుమతి సుంకాలు పెంచేయడంతో అందరి ఎగుమతులు దెబ్బతిని, వాణిజ్య యుద్ధం విజృంభించింది. అంతర్జాతీయ వాణిజ్యం కుదేలై ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చింది. అన్ని దేశాలు తమ వాణిజ్యం విస్తరించాలని, ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించకూడదని సుద్దులు చెబుతూనే దిగుమతులపై గుట్టుగా సుంకాలు పెంచుతున్నాయి. ఇలా ఎవరికివారు స్వీయ వాణిజ్య రక్షణకు ప్రాధాన్యమివ్వడం ఎగుమతులకు విఘాతం కలిగిస్తుంది. ట్రంప్‌ విధానాల వల్ల ఈ పెడధోరణి ముదిరితే చైనాతోపాటు భారత్‌కూ నష్టమే! చివరకు అమెరికా కూడా ఆర్థికంగా అతలాకుతలమవుతుంది.
నష్టాల చక్రభ్రమణం 

వాణిజ్య యుద్ధం వల్ల ఎగుమతులపై అధికంగా ఆధారపడిన దేశాలకు ఎక్కువ నష్టం కలిగితే, తక్కువగా ఆధారపడిన దేశాలకు కాస్త తక్కువ నష్టం సంభవిస్తుంది. అసలంటూ నష్టపోని దేశాలూ ఏవీ ఉండవు.అనేక పెద్ద దేశాలకన్నా భారతదేశ ఎగుమతుల పరిమాణం తక్కువే కానీ, అవి అత్యధికులకు ఉపాధి కల్పించే రంగాల నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మన ఎగుమతులు తగ్గితే ఉపాధి అవకాశాలూ తగ్గిపోతాయి. వస్తువులు ఒకేచోట తయారై అక్కడే అమ్ముడయ్యే పద్ధతి అదృశ్యమవుతోంది. వస్తూత్పత్తి ప్రక్రియ అనేక దేశాలకు విస్తరించింది. ఈ గొలుసు ప్రక్రియలో తయారైన వస్తువులు పలు దేశాల్లో విక్రయమవుతున్నాయి. ఈ సరఫరా గొలుసు గడచిన 15 ఏళ్లలో అపారంగా విస్తరించింది. అమెరికా కంపెనీలు కేవలం డిజైన్లు ఇచ్చి తమ వస్తువులను పూర్తిగానో, పాక్షికంగానో చైనాలో తయారు చేయించి దేశదేశాల్లో విక్రయించడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక దేశం ఏదో ఒక్క దేశానికో లేక అనేక దేశాలకో ఒక వస్తువును ఎగుమతి చేస్తూ ఉండవచ్చు. కానీ, ఆ వస్తు తయారీకి కావలసిన ముడిపదార్థాలను, విడి భాగాలను వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకొంటుంది. అంటే, ఒక దేశ ఎగుమతులు తగ్గిపోతే అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు తగ్గిపోతాయి. వెరసి ఎగుమతిదారుడు, దిగుమతిదారుడు అంతా నష్టపోతారు. ఉదాహరణకు మెక్సికోను తీసుకుంటే ట్రంప్‌ విధానాలు ఆ దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తాయని అవగతమవుతుంది. మెక్సికోకు ప్రధాన వాణిజ్య భాగస్వామి అమెరికాయే. మెక్సికో ఎగుమతుల్లో 72 శాతం అమెరికాకే చేరుతున్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు మూడింటికీ కలిపి అయిదు శాతమే ఎగుమతి చేస్తోంది. మెక్సికో దిగుమతుల్లో అత్యధికం (49 శాతం) అమెరికా నుంచే వస్తున్నాయి. ఆ తరవాతి స్థానాలను చైనా (17 శాతం), జపాన్‌ (5), దక్షిణ కొరియా (4) ఆక్రమిస్తున్నాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు తగ్గిపోతే, ఇతర దేశాల నుంచి అది దిగుమతి చేసుకునే సరకులూ తగ్గిపోతాయి. అంటే నష్టం ఒక్క మెక్సికోకే పరిమితం కాకుండా ఇతర దేశాలకూ పాకుతుంది.

పలు రంగాలపై పెనుప్రభావం 

భారతదేశం ప్రధానంగా సేవలనే ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో సేవారంగం, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో గరిష్ఠ ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ రంగం నుంచి ఎగుమతుల్లో సింహభాగం అమెరికాకే చేరుతున్నాయి. అమెరికా కనుక వాణిజ్య ఆంక్షలు విధిస్తే మన ఐటీ ఎగుమతులు, తద్వారా ఉపాధి అవకాశాలూ దెబ్బతినడం ఖాయం. సేవారంగ ఎగుమతులకు మూల కేంద్రాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణెల అభివృద్ధి కుంటువడుతుంది. అక్కడ వస్తుసేవల వినియోగం, స్థిరాస్తి రంగం కూడా నష్టపోతాయి. అమెరికాకు ప్రత్యామ్నాయ విపణిని కనుగొనడం ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఐటీ, దాని అనుబంధ రంగాలు దేశవ్యాప్తంగా కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.5 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. భారతదేశ ఎగుమతుల్లో 48 శాతానికి సేవా రంగమే మూలం. ఒకవేళ వాణిజ్య యుద్ధమే విరుచుకుపడితే, దాని దుష్ప్రభావం భారత్‌తో పాటు దాని వాణిజ్య భాగస్వాములపైనా పడుతుంది. 2016 ఏప్రిల్‌, 2017 ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్‌ 5,347 కోట్ల డాలర్ల (రూ.3.58 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేసింది. వీటిలో అత్యధికం అమెరికాకే చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఎగుమతులు ఎక్కువగా (19.30 శాతం) మొత్తం ఐరోపా ఖండ దేశాలకు చేరుతున్నాయి. అందులో 17.08 శాతం ఎగుమతులు ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్యదేశాలకు వెళ్తున్నాయి. మన ఎగుమతుల్లో 17.7 శాతం అమెరికాకు చేరుతున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలతో కూడిన ఉత్తర అమెరికా ఖండానికి 20.45 శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (11.41 శాతం), ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్‌కు 10.82 శాతం భారతీయ ఎగుమతులు చేరుతున్నాయి. ఇంకా మన ఎగుమతులు సింగపూర్‌ (3.15 శాతం), హాంకాంగ్‌ (4.8), చైనా (3.85 శాతం)లకు వెళ్తున్నాయి. మొత్తం మీద భారతదేశ ఎగుమతుల్లో 49 శాతం ఆసియా దేశాలకు చేరుతున్నాయి. ఇక మన దిగుమతుల్లో అత్యధికం చైనా (16.44 శాతం) నుంచి వస్తున్నాయి. జర్మనీ నుంచి 10.97 శాతం, ఈయూ దేశాల నుంచి 15.69 శాతం, ఆసియాన్‌ నుంచి 10.65, అమెరికా నుంచి 5.69, ఎమిరేట్స్‌ నుంచి 5.5, సౌదీ అరేబియా నుంచి 5.1 శాతం, స్విట్జర్లాండ్‌ నుంచి 4.21 శాతం వస్తుసేవలను దిగుమతి చేసుకుంటున్నాం.

ప్రపంచ దేశాలు ఎవరి విపణులను వారు రక్షించుకునే యావలో దిగుమతులపై సుంకాలు పెంచేస్తే, వాణిజ్య యుద్ధం విరుచుకుపడటం ఖాయం. భారదేశ ప్రధాన వాణిజ్య భాగస్వాములు తమ వ్యాపారం కోసం అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఆ దేశాల దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధిస్తే, మన భాగస్వాములకు మన ఎగుమతులూ దెబ్బతినిపోతాయి. అది భారత్‌కు ఎంతో నష్టదాయకం. ఉదాహరణకు చైనా ఎగుమతుల్లో 18 శాతం అమెరికాయే స్వీకరిస్తోంది. మన ఇతర భాగస్వాముల పరిస్థితీ ఇంతే. 12.7 శాతం బ్రెజిల్‌ ఎగుమతులు, అమెరికాకే చేరుతున్నాయి. ఇంకా 26.7 శాతం ఈయూ ఎగుమతులు, 20.2 శాతం జపాన్‌ ఎగుమతులు, 12.3 శాతం దక్షిణ కొరియా ఎగుమతులకు అమెరికాయే ఆధారం. అమెరికా మార్కెట్‌పై భారత్‌ ఈ దేశాలంతగా ఆధారపడటం లేదు. కానీ, అమెరికాకు ఈ దేశాల ఎగుమతులు పడిపోతే అవి మనదేశంతో మునుపటంత జోరుగా వ్యాపారం చేయలేవు. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకు అవసరమైన విడిభాగాలను ఈ దేశాలు భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వాణిజ్య యుద్ధంతో ఈ సరఫరా గొలుసు విచ్ఛిన్నమవుతుంది. సంపన్న దేశాల స్వీయ వాణిజ్య రక్షణ విధానాలవల్ల అందరూ నష్టపోయినా, భారతదేశం ఇంకా ఎక్కువ నష్టపోతుంది. విదేశీ వాణిజ్యం కుదేలైతే మన వ్యాపారాలు బలహీనపడి ప్రజల ఆదాయ, వినియోగాలూ క్షీణిస్తాయి. ఉదాహరణకు మాంస ఎగుమతులను తీసుకోండి. ఆసియా దేశాలు ఆర్థికంగా బలహీనపడితే అవి మన నుంచి ఇదివరకటిలా మాంసాన్ని దిగుమతి చేసుకోలేవు. దాంతో మాంస వ్యాపారంపై ఆధారపడినవాళ్లంతా నష్టపోతారు.
వ్యూహరచన అవసరం 

భారతదేశం కోశ, ఆదాయ, కరెంటు ఖాతాలు మూడింటిలోనూ లోటును ఎదుర్కొంటోంది. ఇదే మన ముందున్న అతి పెద్ద సమస్య. 25 దేశాలతో మనం రూ.5.6 లక్షల కోట్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాం. ఈ దేశాలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలంటే భారత్‌కు దండిగా విదేశ మారక ద్రవ్యం కావాలి. విదేశీ వాణిజ్యంతో పాటు విదేశాల నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులు, మన స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవహించే నిధులు, ప్రవాసులు స్వదేశానికి పంపే సొమ్ము- ఇవన్నీ భారత్‌కు విదేశ మారక ద్రవ్యాన్ని సమకూర్చే వనరులు. 2013 నుంచి భారత్‌లోకి ఏటా 6,700 కోట్ల డాలర్ల విదేశ మారక ద్రవ్యం ప్రవహిస్తోందని ఈ ఏడాది మార్చి 23న రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో విదేశాంగ మంత్రి తెలిపారు. 2015-16 నుంచి ఈ ప్రవాహం తగ్గిందని, ఈ ఏడాది 6,100 కోట్ల డాలర్లు మాత్రమే రావచ్చునన్నారు. ప్రస్తుతానికి భారత్‌ వాణిజ్య లోటు అదుపులోనే ఉన్నా, వాణిజ్య యుద్ధం విరుచుకుపడితే నిధుల ప్రవాహం తగ్గి దిగుమతుల బిల్లును చెల్లించడం కొంత కష్టం కావచ్చు. దీంతో మన ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందన్న భయం వ్యాపించి, భారత్‌ నుంచి పెట్టుబడులు పలాయనం చిత్తగించవచ్చు. ముఖ్యంగా భారతీయ స్టాక్‌ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులను విదేశీ సంస్థాగత మదుపరులు తక్షణం వాపసు తీసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి అవాంతరాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సంవత్సరం అమెరికాలో పంటలు విరగకాశాయి. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. చైనాతో సంబంధాలు చెడినట్లయితే ఆ దేశానికి అమెరికా వ్యావసాయిక ఎగుమతులు తగ్గిపోయి ట్రంప్‌నకు అనుకూలంగా ఓటు వేసిన గ్రామీణ ఓటర్లు ఆర్థికంగా దెబ్బతింటారు. దీన్ని నివారించడానికి భారతీయ విపణిని తెరవాలంటూ ట్రంప్‌ ఒత్తిడి చేయవచ్చు. దానివల్ల మన గ్రామాలకు తీవ్ర విఘాతం ఎదురవుతుంది. ప్రస్తుతం భారత్‌ ప్రధానంగా వంటనూనెలను దిగుమతి చేసుకొంటూ రైతు ప్రయోజనాలను రక్షించడం కోసం ఇతర వ్యావసాయిక ఉత్పత్తుల దిగుమతిని నివారిస్తోంది. లేకుంటే మన గ్రామీణ సమాజం విదేశీ దిగుమతులను తట్టుకోలేక అతలాకుతలమవుతుంది. కాబట్టి వాణిజ్య యుద్ధం తెచ్చిపెట్టే ప్రమాదాలను గుర్తెరిగి యుద్ధ నివారణకు ప్రపంచమంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భారత్‌ ఈ విషయంలో అప్రమత్తంగా మెలగాలి.

మిగులు తరిగి దిగులు...
న సేవారంగ ఎగుమతుల్లో అత్యధిక భాగాన్ని అందుకొంటున్న అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగితే భారత్‌ చాలా నష్టపోతుంది. కారణం- మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకొంటున్న దానికన్నా ఎగుమతి చేస్తున్నదే ఎక్కువ కాబట్టి. ఫలితంగా భారత్‌కు నేడు అమెరికాతో రూ.1.03 లక్షల కోట్ల మిగులు ఉంది. మన వాణిజ్య భాగస్వాముల్లో మరే దేశం వద్ద ఇంత మిగులు లేదు. చైనా తరవాత అమెరికాయే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్‌కున్న 20 అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో కేవలం ఎనిమిది దేశాలతోనే వాణిజ్య మిగులు ఉంది. అందులో 75 శాతం ఒక్క అమెరికా వద్దే ఉంది. మిగతా దేశాలతో మనకున్న మిగుళ్లన్నీ దీనిముందు దిగదుడుపే. మరోవైపు చైనాతో మనకు రూ.2.59 లక్షల కోట్ల వాణిజ్య లోటు ఉంది. అంటే, చైనాకు మన ఎగుమతులకన్నా ఆ దేశం నుంచి మన దిగుమతులే చాలా ఎక్కువన్న మాట.

Source : Eenadu
Labels: ,

Post a Comment

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.