న్యాయానికి ఒక్కడు! 
ఆత్యయిక స్థితిపై తీర్పునకు 40ఏళ్లు 
ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భారత న్యాయ వ్యవస్థ సమున్నత సంప్రదాయాలు నెలకొల్పుతోంది. సామాజిక సంక్లిష్టతలను అర్థం చేసుకొని, పౌరుల స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ తీర్పులు ఇవ్వడంలో కాలం గడుస్తున్నకొద్దీ భారత న్యాయవ్యవస్థలు పరిణతి చెందుతున్నాయి. అత్యవసర పరిస్థితి కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పు మాత్రం అందరినీ నివ్వెరపాటుకు గురిచేసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం, ఏప్రిల్‌ 28న ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు చరిత్రలో ఓ మాయనిమచ్చలా మిగిలిపోయింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలుజేసిన ‘ఏడీఎం జబల్పూర్‌’ కేసులో నాలుగు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు సరిగ్గా ఇవ్వాళ్టి రోజే తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యవాదుల, స్వేచ్ఛాకాముకుల విశ్వాసాలపై బలంగా దెబ్బకొడుతూ భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిణామక్రమంలో ప్రజల పక్షాన అద్భుతమైన తీర్పులు వెలువరిస్తున్న న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తీసుకువచ్చిన ఆ తీర్పును మననం చేసుకోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- రాజకీయ కారణాలతో ప్రభావితం కాకుండా తీర్పులు వెలువరించాల్సిన అవసరాన్ని పునస్మరించుకోవడం. రెండోది- నలుగురు న్యాయమూర్తులు ఒకవైపు నిలిచినా, తాను ఒక్కడే సత్యంవైపు నిలిచి ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా నిర్భయంగా ‘మైనారిటీ తీర్పు’ ప్రకటించిన జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా ప్రతిభను, ధైర్యాన్ని, ఆయనకు న్యాయనిపుణులు ఇచ్చిన గౌరవాన్ని తెలియచెప్పడం!
ఆత్యయిక పరిస్థితి చీకటి రోజుల్లో అడ్డూఆపూ లేకుండా అక్రమ నిర్బంధాలు జరిగాయి. విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను, వారి అనుచరులను ఎటువంటి విచారణ లేకుండా నెలల తరబడి జైలులో ఉంచే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. చట్టసభలు నిర్వీర్యమై, ప్రభుత్వ పోలీసు యంత్రాంగాలు యథేచ్ఛగా జులుం ప్రదర్శిస్తున్నప్పుడు, కొందరు ఆశావాదులు రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదు అని అప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసి ఉన్నారు. కాబట్టి తమ అరెస్టులను ప్రశ్నిస్తూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు లేదన్నది ఏలినవారి వాదన. ఆ వాదనతో రాష్ట్రాల్లోని ఏ హైకోర్టూ ఏకీభవించలేదు. అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ జారీ చేయవచ్చు అని స్పష్టం చేస్తూ రాష్ట్రాల్లోని సర్వోన్నత న్యాయస్థానాలు తీర్పులు వెలువరించాయి.
హైకోర్టుల తీర్పును జీర్ణించుకోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అన్ని అప్పీళ్లనూ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. వాదనలు వింటున్న సమయంలో జస్టిస్‌ ఖన్నా ‘ఎమర్జెన్సీ కాలంలో పౌరులను పోలీసులు చంపివేసినా కోర్టులు ఏమీ చేయలేవా?’ అని అడ్వకేట్‌ జనరల్‌ని ప్రశ్నిస్తే, ఆయన ‘ఏమీ చేయలేవు’ అని సమాధానమిచ్చారు. అలాంటి జవాబు ప్రభుత్వంవైపునుంచి విన్న తరవాత కూడా సర్కారీ వాదనను సమర్థిస్తూ 4:1 మెజారిటీతో ధర్మాసనం అప్పట్లో తీర్పు ప్రకటించడం గమనార్హం. ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్షలను మంట కలుపుతూ, సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు జడ్జీలు ప్రకటించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం పౌరులను చంపివేసినా, అత్యున్నత న్యాయస్థానంతోసహా, ఏ కోర్టూ ఏమీ చేయలేదని చెప్పడంతో న్యాయ ప్రపంచం నివ్వెరపోయింది.
మెజార్టీ తీర్పు పాలకుల పక్షాన వస్తే- జస్టిస్‌ ఖన్నా గళం ఒక్కటి మాత్రం ప్రజల వైపున నిలిచింది. జీవించే హక్కు ప్రభుత్వాలు ప్రసాదించినది కాదు కాబట్టి, ఆ హక్కును హరించే హక్కు సర్కారుకు లేదంటూ ఆయన ఇచ్చిన తీర్పునకు విశేష ప్రాచుర్యం లభించింది. ‘మైనార్టీ తీర్పు’గా అది అమలుకు నోచుకోనప్పటికీ- న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, నిష్పాక్షికతకు ఆయన తీర్పు దర్పణంగా నిలిచింది. కానీ, ఆ తీర్పు జస్టిస్‌ ఖన్నాకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన తరుణంలో, ఆయనకంటే జూనియర్‌గా ఉన్న మరో వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీచేశారు. అందుకు నిరసనగా జస్టిస్‌ ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. పదవినుంచి వైదొలగినా ప్రపంచవ్యాప్తంగా నిష్పక్షపాత న్యాయానికి నిలువెత్తు రూపంగా జస్టిస్‌ ఖన్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
గడచిన రెండున్న దశాబ్దాలుగా భారత న్యాయవ్యవస్థ ప్రజల తరఫున నిలిచి అనేక సంచలన తీర్పులు ప్రకటిస్తోంది. జస్టిస్‌ ఖన్నా వంటి మహనీయుల స్ఫూర్తితో స్వతంత్ర న్యాయవ్యవస్థ విశిష్టతను కాపాడుకునే క్రమంలో మరింత అంకితభావం ప్రదర్శించాల్సిన అవసరం కొట్టిపారేయలేనిది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు విరివిగా బెయిళ్లు మంజూరు చేస్తున్నారనే కారణంతో పోలీసు యంత్రాంగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఒక ప్రధాన జ్యుడిషియల్‌ మేజిస్ట్రేటుని ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త కలవరం కలిగిస్తోంది. జాతీయ జ్యుడిషియల్‌ అకాడెమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ప్రసంగించడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన విషయం కేవలం విచారించవలసిన విషయం కాదు- నిశితంగా చర్చించాల్సిన అంశం! దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాలన్నింటిలోనూ జడ్జీలను నియమించకుండా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతున్నాయా అనే సందేహమూ కలుగుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై పాలకులకు ఉన్న లేదా లేని అవగాహనపై చర్చ మొదలు పెట్టాల్సిన సమయమూ ఆసన్నమైంది. ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించే; ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థను ఏ స్థాయిలో అప్రతిష్ఠ పాలు చేస్తాయన్న విషయాన్నీ మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
- కె.పట్టాభిరామారావు 
(రచయిత- జాతీయ పోలీసు అకాడమీ ఉపసంచాలకులు)
Courtesy : ఈనాడు 
Labels: , ,

Post a Comment

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.