నేల... పట్టు తప్పుతున్న వేళ! 
వరస భూకంపాలు- నేర్వాల్సిన పాఠాలు 

క్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వరసగా సంభవిస్తున్న పెను భూకంపాలు ప్రపంచం మొత్తానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను సైతం భూమ్మీదనుంచే నియంత్రించగల అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంలో పరిణతి సాధించిన మానవ మేధకు, భూమి లోపలి పొరల్లో నిత్యం చోటుచేసుకుంటున్న కదలికల గురించి అంతుచిక్కకపోవడం ఆశ్చర్యకరమే. స్వల్ప వ్యవధిలో అపార నష్టాలను తెచ్చే భూకంపాలను ముందుగానే పసిగట్టే దిశగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోని సంక్లిష్టతల దృష్ట్యా నిర్దిష్ట ఫలితాలు మాత్రం దక్కడం లేదు. కొన్ని సెకన్ల ముందు భూకంపాల రాకను పసిగట్టగల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో వరస ప్రకంపనలు; జపాన్‌, ఈక్వెడార్లలో పెను భూకంపాలు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి పదహారు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22 భూప్రకంపనలు నమోదయ్యాయి. భారత్‌లో మూడుసార్లు, భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో రెండుసార్లు నమోదైన ప్రకంపనలు మనదేశానికీ వణుకు పుట్టిస్తున్నాయి.


సంక్లిష్ట సమస్య 
ఒకచోట భూకంపం వస్తే దాని ప్రకంపనల ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుంది. కానీ, జపాన్‌, ఈక్వెడార్లలో వచ్చిన భూకంపాలు కొత్త చర్చకు తెరతీశాయి. ఒకచోట భూకంపం వస్తే దాని ప్రభావం సుదూర ప్రాంతాలపైనా పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా భూవిజ్ఞాన సర్వేక్షణ సంస్థ చెబుతోంది. అందుకు దాఖలాగా జపాన్‌, ఈక్వెడార్‌ భూకంపాలను చూపుతోంది. రెండు దేశాల మధ్య 15,445 కిలోమీటర్ల దూరం ఉంది. తొలుత ఏప్రిల్‌ 15న జపాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. గంటల వ్యవధిలో ఈక్వెడార్‌ను 7.8 తీవ్రతతో పెను భూకంపం కుదిపేసింది. ఈ రెండు భూకంపాలూ ‘పసిఫిక్‌ అగ్నివలయం’లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూకంపాల్లో 98శాతం ఇక్కడే వస్తుంటాయి. విస్ఫోటక అగ్ని పర్వతాలు, భూకంప క్రియాశీలతకు ఈ ప్రాంతం నిలయం. ఈక్వెడార్‌లో భూకంపం ధాటికి పసిఫిక్‌ తీరంలోని పట్టణాలన్నీ దెబ్బతిన్నాయి. వందల మైళ్ల దూరంలోని రాజధాని క్విటో, వాణిజ్య నగరం గువాయాక్విల్‌ నగరాలనూ ప్రకంపనలు భీతిల్లజేశాయి. ప్రధాన భూకంపం తరవాతా 55సార్లు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూపొరల్లో సర్దుబాట్లు ఏ రీతిగా ఉన్నాయో దీన్నిబట్టి అవగతమవుతోంది. తాజా భూకంప ప్రాంతం నుంచి దక్షిణాన 43కి.మీ. దూరంలో సరిగ్గా 74ఏళ్ల క్రితం 1942 మే 14న రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. జపాన్‌లోనూ వరసగా రెండు రోజులు మొదట 6.1 తీవ్రతతో, మరుసటి రోజు 7.0 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. రెండు దేశాల్లో ఘటనల సామీప్యత, క్రమానుగత సంబంధం కారణాలవల్ల మరింత లోతైన అధ్యయనాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది.

అమెరికా భూవిజ్ఞాన సంస్థ అధ్యయనం ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 7.0 నుంచి 7.9 తీవ్రతతో కూడిన భూకంపాలు ఏటా 15సార్లు సంభవిస్తాయి. అత్యంత శక్తిమంతమైన 8.0 తీవ్రతగల భూకంపాలు ఏటా ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో చాలావరకు అత్యల్ప తీవ్రత కలిగినవి. వాటిని గుర్తించడం కుదరదు. శక్తిమంతమైన తీవ్రత భూకంపాలను గుర్తించేలోపే క్షణాల్లో అది పెను విధ్వంసం సృష్టిస్తుంది. భారత ఉపఖండంలోనూ భూప్రకంపనలు తరచూ నమోదవుతున్నాయి. పెను భూకంపం ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడుతోందన్న ఆందోళన భారత్‌ను కొంతకాలంగా కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో 59శాతం భూకంపం రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమే. నేపాల్‌ పెను భూకంపం విధ్వంసం అనంతరం పరిస్థితులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణులు విశ్లేషించారు. ఉత్తర భారతంలోని పర్వత సానువుల చుట్టూ ఉన్న ప్రాంతమంతటా భారీ భూకంపాల ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో హిమాలయాల ప్రాంతంలో అతి భారీ భూకంపం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న కేంద్ర విపత్తుల నిర్వహణ బృందం, రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 8.2గా ఉండొచ్చని అంచనా వేసింది. నిరుడు 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపమే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి నేపాల్‌ను మరుభూమిగా మార్చేసింది. ఈసారి మనదేశంలో 8.2 తీవ్రత భూకంపం వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వూహకు అందదు. భూ అంతర్భాగంలోని పలకల స్థానం భ్రంశం రేటు, దిశ, గమ్యం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేయలేకపోవడమే ప్రధాన లోపం. భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో కేంద్రసర్కారు 11 పర్వత ప్రాంతీయ రాష్ట్రాల సదస్సు నిర్వహించింది. నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, భారత్‌లోని హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలన్నింటికీ భారీ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పర్వత ప్రాంతాల్లో భవనాలు భూకంపాలను తట్టుకొనే విధంగా నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నేపాల్‌ భూకంపం తరవాత మొట్టమొదటిసారిగా భారత్‌లో భూకంప తరంగాలను ముందస్తుగా గుర్తించి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ఉత్తరాఖండ్‌లో నెలకొల్పారు. భూకంప పరిశోధనల్లో ఇది ఓ ముందడుగే. కాకపోతే భూకంపం రావడానికి కేవలం నలభై సెకనుల ముందు మాత్రమే హెచ్చరికల సమాచారాన్ని ఈ కేంద్రం అందజేయగలుగుతుంది. అదీ అయిదు, అంతకుమించిన పాయింట్ల తీవ్రతగల భూకంపాల సమాచారాన్ని పసిగడుతుంది. భూకంప సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు (పి) అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కాబట్టి సెన్సర్లు ముందుగా ‘పి’ తరంగాలను పసిగట్టి సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తాయి. వీటి వెనకే వచ్చే ద్వితీయ తరంగాలు (ఎస్‌) అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ నష్టాల్ని కలిగించి విధ్వంసాలు సృష్టిస్తాయి. ‘స్పేస్‌ డైనమిక్స్‌’ అనే ఇటలీ సంస్థ ఇప్పటికే ఇలాంటి ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థను జపాన్‌, ఇటలీ, అమెరికా దేశాల్లో ఏర్పాటు చేసింది. నిరుడు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచంలోని ఇతర దేశాలు వినియోగిస్తున్న వ్యవస్థలన్నింటికన్నా ముందస్తుగా భూకంపాల రాకను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ఈ కేంద్రం ప్రత్యేకత. భారత్‌ ఈ ఏడాది జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్‌’ సంస్థ సహకారంతో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది.

అధునాతన వ్యవస్థే దిక్కు 

ఆకస్మికంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో అత్యధిక స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమయ్యేవి భూకంపాలే. ప్రస్తుతం అనేక దేశాల్లో భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా భూవిజ్ఞాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచే ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోంది. భారత్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేయడం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. భారత్‌ ఈ దిశగా పరిశోధనలు జరిపి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాలిఫోర్నియాలో వినియోగిస్తున్న ఆధునిక ‘షేక్‌ అలర్ట్‌’ వ్యవస్థ తరహా భూకంప హెచ్చరిక-అప్రమత్త వ్యవస్థను భారత్‌లో సైతం వినియోగించుకునే దిశగా కృషి జరగాలి. జపాన్‌తోపాటు నేపాల్‌, ఈక్వెడార్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో, టర్కీ, ఇండొనేసియా, భారత్‌లు అత్యంత భూకంప సంభావ్యత గల దేశాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా భూకంప సంభావ్యత గల ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో హెచ్చరికల జారీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లయితే కనీసం కొన్ని సెకన్ల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా కనీసం ప్రాణనష్టాలనైనా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న భూకంపాలు, వరదలు తదితర విపత్తుల వల్ల 18,000కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుని అప్రమత్తంగా మసలుకోవడం ద్వారానే కొంతమేరకైనా విధ్వంస తీవ్రత తగ్గించవచ్చు. జపాన్‌ తరహాలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భవన నిర్మాణాల విషయంలో భూకంపాలను తట్టుకునే ఆకృతి, నిర్మాణ పద్ధతులను మనదేశమూ అభివృద్ధిపరచాలి. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య భూ ప్రకంపనలను తట్టుకునే విధంగా బేరింగులు ఏర్పాటు చేయాలి. భూకంప తీవ్రత తగ్గించేలా నిర్మాణాలు చేపట్టడానికి భారతీయ ప్రమాణాల సంస్థ సూచించిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించేట్లు చూడాలి. జాతీయ భూకంపాల నష్ట నివారణ పథకం 2013లోని మార్గదర్శకాలు విధిగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే సాంకేతిక పరిజ్ఞానానికి మానవ ప్రయత్నం, నష్ట నివారణ చర్యలు తోడై భూమండలానికి పొంచి ఉన్న పెను భూకంపాల ముప్పు నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు!

- మనస్వి
Courtesy : ఈనాడు 
Labels: , ,

Post a Comment

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.