పట్టణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబాటు చాటిన చంద్రబాబు ప్రభుత్వం, విస్తృత కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. రూ.9,700కోట్లకు పైగా అంచనా వ్యయంతో సుమారు లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా మార్గం సుగమమైంది. అందులో లక్షన్నర బహుళ అంతస్తుల నివాసాలు పోను, తక్కినవి లబ్ధిదారుల సొంత స్థలంలో కట్టనున్న విడి ఇళ్లు. సమకూర్చుకున్న ఇంటి జాగా ఉండీ ఆర్థిక సత్తా కరవైన వ్యక్తులు, బ్యాంకు రుణం రూ.90వేలు సహా మొత్తం లక్షరూపాయలు భరించగలిగితే- రాష్ట్రప్రభుత్వం లక్ష, కేంద్రం మరో లక్షన్నర రూపాయల మేర సబ్సిడీగా సమకూరుస్తాయంటున్నారు. నిర్మాణ బాధ్యత లబ్ధిదారులదే! బహుళ అంతస్తుల ఇళ్లకైతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సబ్సిడీ చెరో లక్షన్నరకు అదనంగా లబ్ధిదారులపై పడే భారం రూ.2.5లక్షలు. అందులో రెండు లక్షల 40వేల రూపాయలదాకా బ్యాంకు రుణంగా పొందగల వీలుండటం- గూడు లేని పట్టణ పౌరులకు గొప్ప వూరట. మొత్తం పథకం అమలుకయ్యే వ్యయభారంలో లబ్ధిదారుల నికర వాటా సుమారు 42శాతం; రాయితీ రూపేణా కేంద్రం దాదాపు 30శాతం, తక్కింది రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కలు నిక్కచ్చిగా కనిపిస్తున్నా, లబ్ధిదారుల ఎంపిక లగాయతు పారదర్శక వ్యవహార సరళి- పథకం సాఫల్యానికి ప్రాణావసరం. కాంగ్రెస్ పదేళ్ల ఏలుబడిలో కోటి గృహాల నిమిత్తం మంజూరైన రూ.42వేల కోట్లలో ఖర్చుపెట్టింది రూ.12వేల కోట్లేనని, అందులో మూడోవంతుకు పైగా దళారుల పాలబడిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కట్టామన్న పద్నాలుగున్నర లక్షల ఇళ్లకు ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లూ లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్వయంగా చెప్పిందే. కొత్తగా తలపెట్టిన పట్టణ గృహనిర్మాణ యోజనలో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకూ తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే, ప్రాథమిక గండం గడచి గట్టెక్కినట్లు!
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గృహనిర్మాణం తలపెట్టినా సింగపూర్, హాంకాంగ్, చైనాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవాలని అధికార యంత్రాంగానికి ఆరునెలల క్రితమే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇళ్లనిర్మాణం వేగంగా పూర్తవ్వాలని, నాణ్యంగా ఉండాలని గిరిగీశారు. ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ నమూనా దేశానికే ఆదర్శప్రాయం కావాలన్న ఆయన మనోవాంఛా ఫలసిద్ధి కోసం, అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి. టెండర్ల ప్రక్రియ ద్వారా గుత్తేదారులకు బహుళ అంతస్తు నిర్మాణాల బాధ్యత దఖలుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ దశలోనూ అవినీతి చొరబడకుండా కాచుకోవడంతోపాటు, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణతోనే పథకం సజావుగా సాగుతుంది. కనీస జాగ్రత్తల్ని గాలికి వదిలేస్తే వాటిల్లే దుష్పరిణామాలను ‘రాజీవ్ స్వగృహ’ రసాభాస ఇప్పటికే కళ్లకు కట్టింది. మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్ ధరకన్నా 25శాతం తక్కువకే ఇళ్లు కట్టిస్తామంటూ నాడు వై.ఎస్. సర్కారు ఆడంబరంగా ఆరంభించిన పథకమది. ఆ ఇళ్లను ఇప్పుడెవరూ కొనేవారు లేక వేల సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయి. తాగునీరు, రహదారులు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా కట్టిన ఆ ఇళ్లలో పాదం మోపేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు పట్టణ నిధులు వెచ్చించే వీల్లేక అనేక స్వగృహాలు కొరతల కొలిమిలో కుములుతున్నాయి. పకడ్బందీ ప్రణాళిక కరవై నిరుపయోగంగా మిగిలిన వేలాది ‘రాజీవ్ స్వగృహ’ నిర్మాణాల తరహా బాగోతాలు పునరావృతం కాకుండా, రాష్ట్రప్రభుత్వం అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది!
రాష్ట్రంలో గూడులేని ఆరు లక్షల మంది నిరుపేదలు, అల్పాదాయ వర్గాల వారికోసం మొత్తం రూ.16వేలకోట్ల అంచనా వ్యయంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం స్వీయ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏడు వారాల క్రితం ప్రకటించారు. లక్ష్యసాధనలో విదేశాల సాంకేతిక ఒరవడిని అందిపుచ్చుకోవాలని అభిలషిస్తున్న ఆయన ప్రభుత్వం, ఆయా విజయగాథల వెనక అపారకృషి తాలూకు ప్రాముఖ్యాన్ని సంపూర్ణంగా ఆకళించుకోవాలి. ప్రజలందరికీ సొంతిళ్లు కల్పించిన అతికొద్ది దేశాల్లో ఒకటైన సింగపూర్ నిర్మాణ ప్రణాళిక వైశిష్ట్యం సాటిలేనిది. గృహసముదాయాలకు చేరువలో విద్యాలయాలు, పార్కులు ఏర్పరచి, ప్రధాన రహదారులతో అనుసంధానించి, పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదభరితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో- ముందుచూపు, అంతకుమించి కళాత్మకత ఉట్టిపడతాయి. బహుళ అంతస్తుల పరిసర ప్రాంతాల సుందరీకరణకు స్థానికులు చొరవ చూపితే, తామే నిధులందించడం గృహవసతి పట్ల సింగపూర్ ప్రభుత్వ విశేష ప్రాధాన్యాన్ని చాటుతుంది. సత్వర పరిపూర్తి స్ఫూర్తికి పెద్దపీట వేయాలని నినదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇక్కడి గృహనిర్మాణ పథకాలన్నింటికీ తొలుత మౌలిక సదుపాయాల పరికల్పన పూర్తయ్యాకనే- పనులకు పచ్చజెండా వూపడం మేలు. గుత్తేదారుల ప్రమేయం కలిగిన సర్కారీ పథకాల ఇంపుసొంపులపై వేరే ప్రస్తావించనక్కర్లేనంతగా లొసుగుల బాగోతాలెన్నో తెలుగు గడ్డపై పోగుపడి ఉన్నాయి. ఆ దృష్ట్యా, పనుల నాణ్యతపై సరైన పర్యవేక్షణను రాష్ట్రప్రభుత్వం ఎంత మాత్రం అలక్ష్యం చేసే వీల్లేదు. రాయితీల రూపేణా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సౌహార్దం, లబ్ధిదారుల శ్రమఫలాలతో ముడివడిన ప్రతిష్ఠాత్మక గృహనిర్మాణమిది. ఇందులో ప్రతి ఒక్క రూపాయీ సద్వినియోగమయ్యేలా పటిష్ఠ కార్యాచరణ వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం సవ్యంగా పట్టాలకు ఎక్కించాలి!
Courtesy : ఈనాడు
Courtesy : ఈనాడు
Post a Comment