పాక్ కుట్రలపై జలఖడ్గం
అణువణువునా దురహంకారంతో వరస అణుపరీక్షలకు ఉరకలెత్తుతున్న ఉత్తర కొరియాను కఠిన ఆంక్షల కొరడా ఝళిపించి నియంత్రించి తీరాలన్న దానిపై దాదాపు ప్రపంచ దేశాలన్నింటిదీ ఒకటే మాట. పెనుముప్పుగా దాపురించిన భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)ను తుదముట్టించాల్సిందేనన్న అంశంపైనా అంతర్జాతీయ సమాజానిది ఒకటే బాట. అడ్డదారిన అణ్వస్త్రం సముపార్జించి, దొడ్డిదారిన ఆ పరిజ్ఞానాన్ని ఉత్తర కొరియా, ఇరాన్లకు బదలాయించి, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు నారూ నీరూ పోసి పెంచుతున్న పాకిస్థాన్- అణు ఉగ్రవాద పెను విలయశక్తి అనడంలో మరోమాట లేదు. ఉగ్రవాదాన్నే ప్రభుత్వ విధానంగా తీర్చిదిద్దిన ఇస్లామాబాద్‌ను ఏకాకిని చెయ్యాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఎలుగెత్తినా, అది ఎందరి చెవికెక్కిందన్నది ప్రశ్నార్థకమే. భారత్ సౌహార్దాన్ని బలహీనతగా ఎంచి ఉగ్రవాద వ్యాఘ్రాల దాడులతో నెత్తుటేళ్లు పారిస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా గుణపాఠం నేర్పాల్సిందేనన్న జాతి మనోగతమూ అర్థవంతమే. రెండు అణ్వస్త్ర రాజ్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే విజేతలు ఎవరూ ఉండరనే దూరదృష్టితో, 1960నాటి కీలక ‘జల సంధి’పై మోదీ ప్రభుత్వం చూపు సారించింది. సింధు జలాల ఒప్పందానుసారం జమ్మూకశ్మీర్ నుంచి ప్రవహించే సింధు, చీనాబ్, జీలం వంటి పశ్చిమ నదుల నియంత్రణాధికారం పాకిస్థాన్‌కు; పంజాబ్ ద్వారా సాగిపోయే రావి, బియాస్, సట్లెజ్‌ల బాధ్యత ఇండియాకూ దఖలు పడింది. జమ్మూకశ్మీర్‌లో ఆరు లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందేలా సింధు, చీనాబ్, జీలం నదుల్లో మన వాటా నీటిని గరిష్ఠంగా వాడుకోవాలని, లోగడ ఏకపక్షంగా రద్దుచేసిన తుల్‌బుల్ ప్రాజెక్టును పునస్సమీక్షించాలనీ ప్రధాని మోదీ నిర్ణయించారు. ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొన్నప్పుడే సంబంధిత జలసంఘంలో పాక్‌తో సంప్రతింపులు సాగుతాయనీ తేల్చేశారు. చీనాబ్ నదిపై మూడు ఆనకట్టల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచెయ్యాలంటూ, ‘నీరూ రక్తం కలిసి ప్రవహించలేవు’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్య- అక్షరాలా కుక్కకాటుకు చెప్పుదెబ్బ!
ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌కు జవజీవాలు అందించేలా ప్రవహిస్తున్నవి సింధు జలాలు కావు- అవి భారత సౌహార్ద సుహృద్భావాలు! దిగువ దేశానికి 80 శాతం వాటా పెట్టిన సింధు జలాల వంటి అంతర్దేశీయ ఒప్పందం వేరెక్కడా లేదు. పాకిస్థాన్‌లో 65శాతం భూభాగం సింధు పరీవాహక ప్రాంతమే. 90శాతం సేద్య అవసరాలకు, సాగునీటికి, పరిశ్రమలకు అక్కరకొస్తున్నదీ సింధు జలాలే. తమ నదులపై పూర్తి అజమాయిషీ సాధించాలన్న దురాలోచనతోనే కశ్మీరును పాక్ కబళించాలనుకొంటోందన్న విశ్లేషణలు ఏమాత్రం తోసిపుచ్చలేనివి. ఒప్పందం రద్దు లాంటి కఠిన నిర్ణయాల జోలికి పోకుండా, పశ్చిమ నదుల్లో న్యాయబద్ధంగా మన వాటా నీటిని సేద్యం, నిల్వ, విద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలన్న మోదీ ఆదేశమే పాకిస్థాన్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్కేంద్రాలపై ఇండియాను అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి లాగుతామంటూ పాక్ రక్షణ నీటిపారుదల శాఖ మంత్రి మొన్న జూన్‌లో నోరు పారేసుకున్నారు. అటువంటిది ఇప్పుడు వెయ్యి మెగావాట్ల పాకల్‌దుల్, 1020 మెగావాట్ల బుర్సార్, 1200 మెగావాట్ల సవాల్‌కోట్ ప్రాజెక్టులపై మోదీ సర్కారు దృష్టి సారించేసరికి- ‘పాక్‌పై యుద్ధానికి భారత్ సిద్ధం’ అంటూ అక్కడి పత్రికల్లో పతాక శీర్షికలు! వీటికితోడు తుల్‌బుల్ నౌకాయాన ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే తమకు నీటి లభ్యత తగ్గిపోవడంతోపాటు, యుద్ధసమయంలో అది ఇండియాకు అత్యంత అనుకూలంగా మారుతుందని పాక్ పెద్దలు బెంబేలెత్తుతున్నారు. కాబట్టే, భారత్ వ్యవహారసరళిపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ గగ్గోలు పెడుతున్నారు. జమ్మూకశ్మీర్ సామాజికార్థిక ప్రగతికి దోహదపడే ప్రాజెక్టుల పట్ల పాక్ ఏలికల నిజనైజాన్ని కశ్మీరీ యువజనానికి తెలియజేసి, లోయలో భారత్ అనుకూల వాతావరణం పెంపుదలకు ఇదే అదను!
ఎల్లవేళలా యుద్ధం ఆయుధాలతోనే చెయ్యాల్సిన పని లేదు. దాదాపు ఏడు కోట్ల మంది పేదరికంతో అలమటిస్తున్న పాకిస్థాన్లో 42శాతం జనావళి జీవికకు వ్యవసాయమే దిక్కు. వ్యవసాయ రంగంలో వృద్ధి సున్నా స్థాయికంటే (మైనస్) దిగజారి, మూడొంతుల బడ్జెట్ రుణసేవలకే ఖర్చు చెయ్యాల్సిన దురవస్థలో ఉన్న పాకిస్థాన్- ఒప్పందానుసారం తన వాటా నీటిని భారత్ వాడుకొంటానంటేనే ఎందుకు ఇంతగా భయకంపితమవుతోందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో పర్యవసానాల్నీ మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా మదింపు వెయ్యాలి. టిబెట్‌లో పుట్టి ప్రవహిస్తున్న సింధు నదిపై ఇండియా తాజా నిర్ణయాలకు చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి: భారత్ స్నేహ హస్తం సాచినప్పుడే కతువా, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరీ దాడులకు తెగబడిన పాకిస్థాన్ మరింత ఉన్మాదంతో ఉగ్రవాద శక్తుల్ని ఉసిగొలిపే ప్రమాదం మరింతగా పొంచి ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సర్వ సమగ్ర ఒడంబడిక (సీసీఐటీ) రూపొందాలని రెండు దశాబ్దాలుగా భారత్ చేస్తున్న ప్రయత్నం ఏమాత్రం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో 28 ఏళ్లుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో నిరంతరం నెత్తురోడుతున్న ఇండియా- ఉగ్రవాద నిర్మూలన జాతీయ కేంద్రం (ఎన్‌సీటీసీ) ఏర్పాటులో మరేమాత్రం జాగు చెయ్యకూడదు. సరిహద్దుల్లోను, నిద్రాణశక్తుల్ని (స్లీపర్ సెల్స్) ఉసిగొల్పి దేశీయంగానూ నెత్తుటి నెగళ్లను ఎగదోసే పాక్ కుహకాన్ని మరింత అప్రమత్తంగా కాచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలిప్పుడు!
Post a Comment