[EDITORIAL] వ్యర్థాలపై సమర్థ వ్యూహం!
‘కాదేదీ పునశ్శుద్ధికి అనర్హం’ అనుకుంటూ ఎన్నో దేశాలు వ్యర్థాలనూ సమర్థ వనరులుగా మలచుకుంటుంటే, ఆ విషయంలో ఇండియా వెనకబాటు అనేక అనర్థాలకు దారితీస్తోంది. అధునాతన జీవనశైలి కారణంగా ఏటికేడు పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాల (ఈ-వ్యర్థాల) పునశ్శుద్ధిని పెద్ద పరిశ్రమగా వృద్ధిచేసిన దక్షిణ కొరియా, యూకే, జపాన్, నెదర్లాండ్స్ లాంటివి అగ్రరాజ్యమైన అమెరికానే తలదన్ని దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఈ-వ్యర్థాల పునశ్శుద్ధి 40శాతానికి చేరగా, ఆ నాలుగూ 50నుంచి 80శాతం దాకా సాధిస్తూ అబ్బురపరుస్తున్నాయి. నవీన జీవనశైలికి సంకేతాలైన పలు వస్తూత్పాదనలు కొన్నాళ్ల వినియోగానంతరం ఈ-వ్యర్థాలుగా మారి దేశ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి గడ్డుసవాళ్లు విసరుతున్నాయి. పాతబడిన కంప్యూటర్లు, టీవీలు, చరవాణులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు లాంటివి దేశంలో కుప్పలుతెప్పలుగా పోగుపడుతున్నాయి. ఇండియాలో ఏటా అలా ‘ఉత్పత్తవుతున్న’ వ్యర్థాల రాశి ఎకాయెకి 18.5లక్షల టన్నులు. దిగ్భ్రమపరచే ఈ గణాంకాలు, భారత్ పోనుపోను ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతోందో చాటుతున్నాయి. ఏడాదికి 1.2లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో ముంబయి నగరం ‘ముందంజ వేస్తోంది’. దిల్లీ(98వేల టన్నులు), బెంగళూరు (92వేలు), చెన్నై (67వేలు) కోల్‌కతా (55వేలు), అహ్మదాబాద్ (36వేలు), హైదరాబాద్ (32వేలు) నగరాల్లోనూ భారీగా ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అసోచామ్, కేపీఎమ్‌జీ సంస్థల సంయుక్త అధ్యయనం తాజాగా వెల్లడించింది. దేశంలో అలా ఉత్పత్తవుతున్న ఈ-వ్యర్థాల్లో కేవలం 2.5శాతమే రీసైక్లింగుకు నోచుకుంటున్నాయన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. లక్షల టన్నుల మేర పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు నేలను, నీటిని, గాలిని విషకలుషితం చేసేస్తున్నాయి. వాటివల్ల మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని, పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యమూ ఏర్పడుతుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో- దిద్దుబాటు వ్యూహాలు చురుగ్గా పదును తేలాల్సి ఉంది!
అత్యధికంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తరవాతి స్థానం ఇండియాదేనని ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఏడాది క్రితం ధ్రువీకరించింది. మూడేళ్ల వ్యవధిలో విశ్వవ్యాప్తంగా ఈ-వ్యర్థాల పరిమాణం 21శాతం దాకా విస్తరించనుందనీ ఆ నివేదిక హెచ్చరించింది. ఏదైనా కొత్త వస్తూత్పాదన విపణిలో పాదం మోపిందే తడవుగా దాన్ని సొంతం చేసుకోవాలన్న మోజు, వేలంవెర్రి పోటీ ఇంతలంతలైన వాతావరణం దృష్ట్యా- దేశీయంగా మరింత ప్రమాదం నెత్తిన ఉరుముతోంది. ఇప్పటికే వందకోట్లకు పైబడి చరవాణులు ఉపయోగిస్తున్న భారత్‌లో, ఏటా దాదాపు నాలుగోవంతు ఈ-వ్యర్థాల బాట పడుతున్నాయి. ఇంకో మూడేళ్లలోనే భారతగడ్డ మీద సంవత్సరానికి 30లక్షల టన్నుల దాకా వ్యర్థాల ఉత్పత్తి నమోదు కానుందని ‘అసోచామ్’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) భవిష్యద్దర్శనం చేస్తోంది. ప్రస్తుతం ఎడాపెడా వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాల్లో సింహభాగం ప్రధానంగా అసంఘటిత రంగానికే చేరుతోంది. వాటిని పునశ్శుద్ధి చేసే నైపుణ్యం, అందుకు అవసరమైన శిక్షణ కొరవడి బడుగు కార్మికులు, పేద పిల్లలు హానికర రసాయనాలూ అవశేషాల కారణంగా మహమ్మారి వ్యాధుల పాలబడుతున్నారు. అటు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ, ఇటు అసంఖ్యాక అభాగ్యుల బతుకుల్ని కర్కశంగా కాటేస్తున్న ఈ-వ్యర్థాల నియంత్రణపై ప్రజల భాగస్వామ్యానికి ప్రోదిచేసే పటుతర కార్యాచరణ తక్షణావసరం. ఈ కీలకాంశానికి సమధిక ప్రాముఖ్యం చేకూరితేనే, ‘స్వచ్ఛభారత్’ స్ఫూర్తి సంపూర్ణ ఫలితాలను ఒడిసిపట్టగలదన్నది యథార్థం.
హానికరమైన వ్యర్థ పదార్థాల దిగుమతిని నిషేధిస్తూ బాసెల్ ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ ఒకటి. స్వదేశంలో పద్ధతి ప్రకారం పునశ్శుద్ధి కార్యక్రమాలు చేపట్టేకన్నా గప్‌చుప్‌గా ఆసియాకో ఆఫ్రికాకో తరలించేస్తే ఎంతో మిగులు అన్న సంపన్న రాజ్యాల దుస్తంత్రం పుణ్యమా అని, ఆ ఒప్పందం నిలువునా నీరుగారుతోంది. ఆఫ్రికాలో ఘనా, నైజీరియాలకు; ఆసియాలో చైనా, మలేసియా, పాకిస్థాన్లతోపాటు భారత్‌కు ఈ-వ్యర్థాల అక్రమ రవాణా ఏటికేడు పోటెత్తుతోంది. ఈ-వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసమంటూ 2011లో క్రోడీకరించిన నిబంధనల అమలు బాధ్యతను యూపీఏ జమానా గాలికొదిలేసింది. పది వారాల క్రితం నూతన నిబంధనావళిని గెజెట్‌లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం- వస్తూత్పాదకులు, డీలర్లు, రాష్ట్రప్రభుత్వాల ఇదమిత్థ బాధ్యతల్ని రెండో ప్రకరణంలో పేర్కొంది. వాటిపై విస్తృత జనచేతన పెంపొందించడంతోపాటు ఈ-వ్యర్థాల సేకరణ, నిర్వహణలకు రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్లను ఆయత్తపరచడం ప్రజాప్రభుత్వాల విహిత బాధ్యత! నిర్ణీత గడువు ముగియడంతోనే విక్రయదారులే ఈ-వ్యర్థాలను వెనక్కి తీసుకునే పద్ధతి నార్వేలో దశాబ్దం కాలంగా అమలవుతోంది. పాత టీవీలు తదితరాల్ని పౌరులు, స్వచ్ఛంద సంస్థలు పునర్వినియోగ కేంద్రాలకు తరలించే సంస్కృతి స్వీడన్‌లో వేళ్లూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశంగా అవతరించిన స్వీడన్ అనుభవాలు, దేశీయ వ్యూహాలకు ఒరవడి దిద్దాలి. వెలుపలి నుంచి అక్రమ తరలింపులు వెల్లువెత్తకుండా కాచుకుంటూ, క్రమేణా పునశ్శుద్ధి కేంద్రాలను విస్తరించే ద్విముఖ ప్రణాళికను సజావుగా పట్టాలకు ఎక్కించడమే- వ్యర్థాల సమస్యకు సరైన విరుగుడు అవుతుంది!